గెజిట్‌లో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం | Sakshi
Sakshi News home page

గెజిట్‌లో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం

Published Wed, Apr 12 2023 8:38 AM

- - Sakshi

ఆన్‌లైన్‌ రమ్మీ.. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఈ పదమే ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకుల నోట్లో ఎక్కువగా నలిగిందంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల వరకు ఈ ఆటకు బానిసై అప్పులపాలైన వారు ఎందరో..! ఇక రుణఒత్తిడి భరించలేక బలవన్మరణాలకు పాల్పడిన వారూ పదుల సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక తర్జనభర్జనలు, విమర్శలు, ప్రతి విమర్శల తర్వాత ఎట్టకేలకూ ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం బిల్లుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదం తెలిపారు.మంగళవారం ఈ మేరకు గెజిట్‌లో ప్రచురించడంతో ఇకపై ఆన్‌లైన్‌ పేకాట ఆడితే.. తాటతీస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

సాక్షి, చైన్నె: ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని ప్రభుత్వ గెజిట్‌లో మంగళవారం ప్రకటించారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదంతో న్యాయశాఖ కార్యదర్శి గోపి రవికుమార్‌ సంతకంతో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ, సమగ్ర వివరాలను,శిక్షలు, కమిషన్‌ ఏర్పాటు గురించి గెజిట్‌లో వివరించారు. దీంతో కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల ఎంపిక చేసేందుకు సీఎం ఎంకే స్టాలిన్‌ కార్యాచరమ ప్రారంభించారు.

నేపథ్యం ఇదీ..
రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసై, అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య తాజాగా 43కు చేరిన విషయం తెలిసిందే. ఈ గేమింగ్‌ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన చట్టాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిరస్కరించారు. దీంతో గత నెల మరోసారి అసెంబ్లీ వేదికగా చట్టానికి మెరుగులు దిద్ది సభ ఆమోదంతో రాజ్‌భవన్‌కు పంపించారు. దీనిని కూడా ఆమోదించేందుకు గవర్నర్‌ కాలయాపన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం తీసుకురావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఈ చట్టాన్ని ఆమోదిస్తూ గవర్నర్‌ ఆర్‌ఎన్‌రవి నిర్ణయం తీసుకున్నారు.

గెజిట్‌లో చట్టం వివరాలు..
ఈ చట్టంలోని సమగ్ర వివరాలను 13 పేజీలలో పొందు పరిచారు. ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి బెట్టింగ్‌ గేమింగ్‌లపై రాష్ట్రంలో నిషేధించినట్లు వివరించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన పక్షంలో మూడు కేటగిరీలుగా విభజించి శిక్ష విధించనున్నారు. గేమ్‌ ఆడే వారు, ప్రకటనలు చేసే వారు, నిర్వాహకులుగా విభజించి అందరికీ వివిధ రకాల శిక్షలను, జరిమానాలను విధించనున్నారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు కానుంది. ఈ కమిషన్‌కు చైర్మన్‌, సభ్యులు ఉంటారు. అలాగే ఈ గేమింగ్‌ వ్యవహారలపై సైబర్‌ క్రైం నిఘా ఉంచనుంది. తమిళనాడులో ఈ గేమింగ్‌ నిషేధం వివరాలను సంబంఽధిత సంస్థలకు తొలుత నోటీసుల ద్వారా తెలియజేయనున్నారు. అప్పటికీ ఆ యా సంస్థలు గేమింగ్‌లు నిర్వహిస్తే తొలుత సైబర్‌ క్రైం కొరడా ఝుళిపిస్తుంది. అలాగే సమగ్ర వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్‌కు అందజేస్తుంది. ఈ కమిషన్‌కు సివిల్‌ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలూ ఉంటాయి. తొలిసారిగా గేమ్‌ ఆడి పట్టుబడే వారికి 3 నెలలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తారు. ఫేస్‌బుక్‌ వంటి వ్యక్తిగత సామాజిక మాధ్యమాల పేజీల్లోకి ప్రకటనల రూపంలో నిషేధిత బెట్టింగ్‌ గేమింగ్‌ సమాచారం పంపిన పక్షంలో, ఆ ప్రకటనదారుకు, నిర్వహకులకు ఏడాది జైలు శిక్ష, రూ. 5 లక్ష వరకు జరిమానా విధించనున్నారు. మళ్లీ మళ్లీ పట్టుబడిన పక్షంలో ఐదేళ్లు వరకు జైలు, రూ. 20 లక్షల వరకు జరిమానా విధించే విధంగా కఠినంగా వ్యవహరించనున్నారు.

కమిషన్‌ ఏర్పాటుకు కార్యాచరణ
ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని మంగళవారం సీఎం స్టాలిన్‌ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు, చట్ట నిపుణులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలతో పదవీ విరమణ పొందిన సీనియర్‌ ఐఏఎస్‌, ఐజీ స్థాయి పోలీసు అధికారులు, ఆన్‌లైన్‌ రంగంలోని నిపుణులను ఈ కమిషన్‌లో సభ్యులుగా నియమించనున్నారు. ఈ జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కమిషన్‌ ఏర్పాటుతో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్టే. గేమింగ్‌లను క్రమబద్ధీకరించే విధంగా ఈ కమిషన్‌ కొరడా ఝుళిపించనుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు ఆన్‌లైన్‌ రమ్మీ తదితర బెట్టింగ్‌ గేమింగ్‌ల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement