నిమిషానికి రూ.5 లక్షలు ఇవ్వాలి: హన్సిక తల్లి డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

నిమిషానికి రూ.5 లక్షలు ఇవ్వాలి: హన్సిక తల్లి డిమాండ్‌

Published Sun, Mar 19 2023 1:32 AM

- - Sakshi

తమిళ సినిమా: బాలనాటిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి హన్సిక. ఆ తర్వాత తమిళంలో ధనుష్‌కు జంటగా, కథానాయకిగా మాప్పిల్‌లై చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా తెలుగులో అల్లు అర్జున్‌కు జంటగా దేశముదురు చిత్రంతో పరిచయమయ్యారు. అలా ఈ రెండు భాషల్లోనూ నటిస్తూ అగ్రకథానాయకి స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా ప్రేమ వ్యవహారంలో ఈ బ్యూటీ పేరు బాగానే వినిపించింది.

నటుడు శింబుతో ప్రేమ పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది. ఇక నటిగా 50 చిత్రాల మైలు రాయిని అధిగమించిన హన్సిక ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా గత 2022 డిసెంబర్‌ 4వ తేదీన ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కతురియను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్‌ లోని 450 ఏళ్ల నాటి ప్రసిద్ధి చెందిన ప్యాలెస్‌లో వీరి వివాహ తంతు వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకను కూడా హన్సిక కుటుంబం వ్యాపారంగా మార్చేశారు.

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఓటీటీ సంస్థకు ఆ వేడుక ప్రసార హక్కులను భారీ మొత్తానికి విక్రయించారు. దీంతో ఆ సంస్థ హన్సిక వివాహ వేడుకతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, వరుడు సోహైల్‌తో వారికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించారు. దాన్ని ఇప్పుడు లవ్‌ షాది డ్రామా పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. అందులో నటి హన్సిక, ఆమె తల్లి మోనా మోత్వానీ గతంలో తాము ఎదుర్కొన్న సమస్యల గురించి, వాటి పరిష్కారం కోసం వారు తీసుకున్న నిర్ణయాల గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

స్ట్రీమింగ్‌ అయిన లవ్‌ షాది డ్రామా ఎపిసోడ్‌ లో హన్సిక తల్లి మోనా చెప్పిన ఒక విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అదేమిటంటే వివాహ వేడుకకు సోహైల్‌ కుటుంబ సభ్యులు సరైన సమయానికి చేరుకోకపోవడంతో టెన్షన్‌ అయిన మోనా మోత్వానీ, సోహైల్‌ తల్లికి ఫోన్‌ చేసి ఇంకా మీరు ఆలస్యంగా వస్తే ప్రతి నిమిషానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని కోరారట. ఈ విషయాన్ని ఆమె ఆ ఎపిసోడ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
 
Advertisement