నేరాల నియంత్రణలో టాప్‌ | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణలో టాప్‌

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

సూర్యాపేటటౌన్‌ : నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో పురోగతి, నిందితులకు శిక్షలు పడేలా పకడ్బందీ చర్యలు, ట్రాఫిక్‌ నిబంధనల అమలులో కఠిన వైఖరి, ప్రజలకు మెరుగైన సేవలు వంటి అంశాల్లో సూర్యాపేట జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకత చాటుకున్నారు. పోలీసుశాఖ పనితీరులో సూర్యాపేట జిల్లా క్లస్టర్‌–4లో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. దాంతో డీజీపీ సీవీ ఆనంద్‌ ఎస్పీ నరసింహకు ప్రశంసాపత్రం అందించి అభినందించారు.

ఎనిమిది అంశాల్లో సత్తా

జిల్లా పోలీసుల పనితీరును ఎనిమిది కీలక సూచికల ఆధారంగా అంచనా వేశారు. చార్జ్‌షీట్‌, నేరాల గుర్తింపు రేటు, కేసుల్లో శిక్షల శాతం, దర్యాప్తునకు పట్టే సగటు సమయం, బాధితుల ఇంటి వద్ద కేసుల నమోదు, ఈ–పెట్టీ కేసులు, ఈ–చలాన్ల జారీ, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆయా విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరచడంతో సూర్యాపేట పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు.

ఆధారాల సేకరణపై ప్రత్యేక దృష్టి

కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించడంతో పాటు నేరాలకు సంబంధించిన బలమైన ఆధారాలు, సాక్ష్యాలను సేకరించడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నేరం జరిగిన వెంటనే దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను గుర్తించడం, కేసులలో సాక్షాలను పకడ్బందీగా సేకరించి కోర్టులో ప్రవేశపెట్టడం ద్వారా నేరస్థులకు శిక్షలు పడేలా చర్యలు చేపడుతున్నారు.

ట్రాఫిక్‌పై ఉక్కుపాదం

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలపై ఈ–చలాన్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంకెన్‌న్‌ డ్రైవ్‌ తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయా అంశాల్లో అంకితభావం, నైపుణ్యం ప్రదర్శించిన సిబ్బందిని డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ గుర్తింపు జిల్లా పోలీసుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

ప్రజలకు మరింత మెరుగైన సేవలు

సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. నేరాల నియంత్రణకు నిరంతరం పనిచేస్తున్నాం, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేరస్థులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రస్థాయిలో లభించిన ఈ గుర్తింపు జిల్లా పోలీసు సిబ్బంది సమిష్టి కృషికి దక్కిన గౌరవం, ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేస్తాం.

– ఎస్పీ నరసింహ

పోలీసుల పనితీరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు

క్లస్టర్‌–4లో సూర్యాపేట జిల్లాకు

ప్రథమ ర్యాంక్‌

ఎస్పీ నరసింహకు డీజీపీ ప్రశంసాపత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement