అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్‌స్వామి, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా నీట్ పీజీ
నల్లగొండ : నల్లగొండలోని ఎస్‌పీఆర్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 180 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 179 మంది హాజరుకాగా ఒకేఒక్క అభ్యర్థి గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తనిఖీ చేశారు. సెంటర్ ఇన్‌చార్జితో పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు సూపరింటెండెంట్ రమేష్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, పరీక్షల ఇన్‌చార్జి, ప్రొఫెసర్ ఉపేందర్ ఉన్నారు.
యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యకల్యాణ వేడుక
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం నిత్య కల్యాణ వేడుకతో పాటు సంప్రదాయ పూజలు కొనసాగాయి. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు మాఢ వీధిలో స్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు.


