భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుత సీజన్‌లో వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపట్టిన శ్రీరైతులతో మాట – పంట మార్పిడికి బాటశ్రీ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున వ్యవసాయ, సాగునీటి వినియోగంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి భరోసా లేని ప్రాంతాల్లో కొత్తగా వరి సాగు చేపట్టే విషయంలో రైతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒకటి రెండు రోజుల వర్షాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, పంట పూర్తయ్యే వరకు అవసరమైన నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని సాగుచేసే పంటను ఎంపిక చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాతో సరైన పంటలను ఎంపిక చేసుకోవాలని రైలులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


