నలుగురు ఎస్సైలు బదిలీ | - | Sakshi
Sakshi News home page

నలుగురు ఎస్సైలు బదిలీ

Jul 10 2026 3:45 PM | Updated on Jul 10 2026 3:45 PM

సూర్యాపేటటౌన్‌ : జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెన్‌పహాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న గోపికృష్ణ సూర్యాపేటటౌన్‌ 2కు, సూర్యాపేట టౌన్‌ – 2లో పనిచేస్తున్న శివతేజను వీఆర్‌ నల్లగొండకు, వీఆర్‌ సూర్యాపేటలో ఉన్న బాలునాయక్‌ను పెన్‌పహాడ్‌ ఎస్‌ఐగా బదిలీ చేశారు. అదేవిధంగా మునగాలకు నల్లగొండ జిల్లా గట్టుప్పల్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఎం.సంజీవ్‌రెడ్డి బదిలీపై వచ్చారు.

12న ‘యంగ్‌ ఇండియా’ ప్రవేశపరీక్ష

సూర్యాపేటటౌన్‌ : యంగ్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో 2026–27 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ గురువారం తెలిపారు. చింతలపాలెం, గరిడేపల్లి, పెన్‌పహాడ్‌ కేజీబీవీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

పంట సాగులో జాగ్రత్తలపై రైతులకు అవగాహన

పెన్‌పహాడ్‌ : వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్‌ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు చంద్రశేఖర్‌, సంధ్యారాణి గురువారం పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని మాచారం, పొట్లపహాడ్‌ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి, కంది, వరి సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వరి నారు మడులను పరిశీలించి పోషక లోపాలున్న చోట, గడ్డి తుంగ జాతి నారుమడిలో పెరిగిన చోట సరైన కలుపు మందుల వాడకాన్ని వివరించారు. పత్తి, కంది, వరి, కూరగాయల పంటలను పరిశీలించారు. పత్తి పంటలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు అధికమవుతున్న చీడపీడలను సమూలంగా నిర్మూలించేందుకు కావలసిన పురుగు మందుల విషయంలో జాగ్రత్తలను వివరించారు. వారి వెంట మండల వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్‌, ఏఈఓ ప్రియాంక తదితరులున్నారు.

కనీస వేతనాలు

అమలు చేయాలి

సూర్యాపేట అర్బన్‌: ప్రైవేట్‌ బస్సు డ్రైవర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ప్రైవేట్‌ పాఠశాల బస్సు డ్రైవర్ల వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం అధ్యక్షుడు శ్రీ హరిబాబుకు గురువారం వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలల, కళాశాల బస్సు డ్రైవర్లు అండ్‌ వర్కర్స్‌కు వేతనాలను రెండు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉండగా అతి తక్కువ వేతనాలతో పని చేయించుకోవడం అన్యాయమన్నారు. వినతిపత్రం అందించిన వారిలో ప్రైవేట్‌ బస్సు డ్రైవర్ల వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు నాగేంద్ర బాబు, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి శ్రీ మామిడి సైదులు గౌడ్‌, సహాయ కార్యదర్శి పొన్నం మురళి, కోశాధికారి షేక్‌ ఖాదర్‌, ప్రచార కార్యదర్శి సిగ సైదులు, గౌరవ సలహా దారులు వెంకట రెడ్డి, సైదులు పాల్గొన్నారు.

అందుబాటులో

కూరగాయల, పూల నారు

గరిడేపల్లి: మండల పరిధిలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన కూరగాయలు, పూల నారు అందుబాటులో ఉందని, ఆసక్తి కల్గిన రైతులు బుకింగ్‌ చేసుకోవచ్చని కేవీకే సిబ్బంది కృష్ణ, సతీష్‌ గురువారం తెలిపారు. టమాటా, వంగ, పచ్చి మిరప, బంతి నారు, పెరటి తోట కూరగాయల కిట్టు, కోకో పీట్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు 90102 12711, 95420 77114 సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement