హుజూర్‌నగర్ : పంటల మార్పిడి విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల అనుకూల చర్యలను ప్రకటించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. గురువారం హుజూర్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని అన్నారు. పంటల మార్పిడి విధానంలో భాగంగా మెట్ట పంటలకు అవసరమయ్యే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. వరికి ప్రత్యామ్నాయ మెట్ట పంటలను సాగు చేసే రైతులకు ప్రోత్సాహకంగా ఎకరాకు రూ 8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో 13, 14, 15 తేదీల్లో నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా ఈనెల 18, 19, 20 తేదీల్లో యాదగిరిగుట్టలో రైతులకు రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేళ్లచెరువు పరిధిలో బ్యాంకులు పరిమితులను దాటి రుణాలు ఇవ్వడంపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 1057 సర్వే నంబరుపై భూ సమగ్ర సర్వే చేసి 20 ఏళ్లకు పైగా పోరాడుతున్న రైతులకు న్యాయం చేయాలని, వారి భూమి హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. దొడ్డ వెంకటయ్య అధ్యక్ష వహించిన సమావేశంలో రైతు సంఘం సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తిపిరాల శ్రీకాంత్ కౌలు రైతుల జిల్లా అధ్యక్షులు అన్నెం పాపిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్, కౌన్సిలర్ చెన్నగాని సైదులు, మండల నాయకులు పాల్గొన్నారు.
ఫ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి పశ్య పద్మ


