భువనగిరి : మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ లూర్థయ్య, బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదాను మొహిజు వ్యక్తిగత కక్షలతో శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
చౌటుప్పల్ : బైక్‌పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన వీరబోయిన కమలహాసన్ యాదవ్(28) హైదరాబాద్‌లోని కాచిగూడలో నివాసముంటూ ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివా రులోని చెరువుకట్ట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమలహాసన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కోదాడరూరల్ : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన బి. బాబుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన రూ.70వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


