మోత్కూరు : మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన వినియోగదారుల అంశంపై ‘వంటింటి యుద్ధం’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన ఫొటో స్టోరీకి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు. ఆర్డీవోను క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించడంతో శనివారం ఆర్డీఓ మోత్కూరుకు చేరుకొని తహసిల్దార్ కార్యాలయంలో వంట గ్యాస్ సిలిండర్లపై సమీక్షించారు. అనంతరం ఆర్డీవో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత అపోహ మాత్రమేనని, సరిపడు నిల్వలు ఉన్నాయని తెలిపారు. భువనగిరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం 20 ఏజెన్సీలు ఉన్నాయని, వాటిల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయబడతాయని తెలిపారు. బుకింగ్ చేసుకున్న వారికి కచ్చితంగా డెలివరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు, పాఠశాలలకు, అంగన్‌వాడి కేంద్రాలకు ఎలాంటి కొరత లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని తెలిపారు.
మరణించినా.. ఐదుగురికి ప్రాణదానం
వేములపల్లి : వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లికంటి వెంకటయ్య(52) మరణానంతరం తన అవయవాలను దానం చేసి ఐదుగురికి ప్రాణదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య ఈ నెల 8న ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంకటయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ వెంకటయ్య భార్య ఎల్లమ్మ, కుమారుడు సురేష్ సామాజిక బాధ్యతతో ఆయన అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. వెంకటయ్య నుంచి సేకరించిన రెండు కిడ్నీలను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి, కళ్లను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి, కాలేయాన్ని అపోలో ఆస్పత్రికి దానం చేశారు. వెంకటయ్య కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గ్రామస్తులు, ఆస్పత్రి సిబ్బంది అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
తిప్పర్తి : కాలినడకన వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణానికి చెందిన జొర్రిగల జ్ఞానేశ్వరి(38) శివుడి దీక్షలో భాగంగా చండూరు నుంచి వాడపల్లిలోని గుడికి కాలినడకన బయల్దేరింది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను శనివారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జ్ఞానేశ్వరి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి అన్న జొర్రిగల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఏఎస్‌ఐ లింగయ్య తెలిపారు. మృతురాలికి వివాహం కాలేదు.


