ఎండుతున్న ఆశలు | - | Sakshi
Sakshi News home page

ఎండుతున్న ఆశలు

Mar 15 2026 4:53 AM | Updated on Mar 15 2026 4:53 AM

ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయన్న ఆశతో సాగు చేసినా..

భానుపురి (సూర్యాపేట) : ముదిరిన ఎండలు, అడుగంటుతున్న జలాలు, మొదలైన కరెంటు కష్టాలతో జిల్లా రైతాంగం తిప్పలు పడుతోంది. ప్రధానంగా వరి పంట ఎండుతోంది. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ నీటిని నమ్ముకుని చాలావరకు సాగు చేసిన పొలాలు కూడా ఎండిపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో మరిన్ని పొలాలు ఎండిపోనున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట చేతికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

4.82లక్షల ఎకరాల్లో వరి సాగు

జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 4.86 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాగే 4.82 లక్షల ఎకరాలు ఉంది. సాగర్‌, మూసీ ఆయకట్టుతో పాటు ఎస్సారెస్సీ రెండోదశకు నీటిని విడుదల చేశారు. అలాగే బోరుబావుల కింద రైతులు వరినే అధికంగా సాగు చేశారు. ఆరుతడి పంటలు రైతులు పెద్దగా సాగు చేయలేదు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తాయని, బోరుబావుల్లో నీరు సమృద్ధిగానే ఉండడంతో మొదట్లో పెద్దగా సమస్యలు రాలేదు. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచి వరి సాగు చేసిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వరి పంటకు నీటి వాడకం పెరగడమే ఇందుకు కారణం. భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోయి బోరుబావులు సగానికి తగ్గాయి.

సాగుకు కరెంట్‌ కష్టాలు

రైతాంగానికి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గతంలో 15 గంటలకు పైగానే వ్యవసాయానికి కరెంటు అందగా.. ప్రస్తుతం ఒకట్రెండు గంటల పాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్‌ వినియోగం కాస్త పెరగడంతో ఓవర్‌లోడ్‌ కారణంగా తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు ఫీజులు కొట్టివేస్తున్నాయి. దీంతో రైతులు సాగు చేసిన వరి పొలాలకు నీటిని అందించడం గగనంగా మారింది. దీనికి తోడుగా చాలామంది రైతులు బోర్లు వేసినా కరెంటు డీడీలు కట్టకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్‌ ఇచ్చి నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉండడంతో ఓవర్‌లోడ్‌ కారణంగా గంటకోసారి ఫీజులు పోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు.

ఫ ఎండల తీవ్రతకు

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఫ కరెంట్‌ కోతలతో నీరందక

ఎండిపోతున్న వరి చేలు

ఫ చివరి దశలో ఉన్న వరి పంట

దక్కకుండా పోతుండడంతో

ఆవేదన చెందుతున్న రైతులు

సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో వరి పంట అధికంగా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ బోరుబావులతో పాటు ఎస్సారెస్పీ రెండోదశ నీళ్లు వస్తాయన్న ఆశతో చాలామంది రైతులు వరి సాగు చేశారు. కరెంటు ఇబ్బందులు, ఎండలు ఉన్నప్పటికీ ఈ నీళ్లు వస్తే తమకు కొంత ఆసరాగా ఉంటుందని భావించినా.. ఆయకట్టు రైతాంగాన్ని జిల్లా యంత్రాంగం మర్చిపోయినట్లుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మేజర్‌ కాలువలను దాటలేని పరిస్థితి ఉన్నప్పటికీ నీటి సరఫరాలో మిన్నకుండిపోవడం గమనార్హం. గతంలో ఆయకట్టు భూములకు నీళ్లు అందగా.. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వెళ్లాయి. ప్రస్తుతం ఎండలతో పాటు కరెంటు కోతలు, ఎస్సారెస్పీ నీళ్లు రాకుండా పోతే దాదాపు 10వేల ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement