భానుపురి (సూర్యాపేట) : కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సుకు సంబంధించి 6 సెమిస్టర్లు ఉంటాయని, మొత్తం సీట్లు 60 ఉన్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులై ఉండాలని, ప్రవేశం పూర్తిగా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని తెలిపారు. 10+2 పూర్తి చేసిన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చని, గరిష్టంగా 23 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్ల అర్హత ఉండాలని తెలిపారు. ఎంపికై న ప్రతి విద్యార్థికి నెలకు రూ. 2,500 స్టైఫండ్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు klbiiht.telangana.gov.in, ఈమెయిల్ iihthyderabad@gmail.com, 040–29367009 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
దరఖాస్తుల స్వీకరణ
భానుపురి (సూర్యాపేట) : 2025–26 సంవత్సరానికి షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక ను ప్రభుత్వం ఆమోదించిందని, వివిధ పథకాలు నెలకొల్పేందుకు ఆర్థిక సాయం నిమిత్తం అర్హులైన షెడ్యూల్డ్ కులాల వారు ఆన్‌లైన్ ద్వారా http://tgobmms.cgg.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాచరణ ప్రణాళిక ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష యూనిట్లకు (90) శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల యూనిట్లకు (80) శాతం సబ్సిడీ, రూ.2లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విలువ చేసే యూనిట్లకు (70) శాతం సబ్సిడీ, రూ.4లక్షలకు పైచిలుకు విలువ చేసే యూనిట్లకు (60) శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.5 లక్షలు) ఉంటుందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలకు (100) శాతం సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు. మిగిలిన శాతం బ్యాంక్ లోన్ ద్వారా పొందాలని పేర్కొన్నారు.
విశేషంగా లక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి, శ్రీఆంజనేయస్వామి, గోదాదేవి అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నాణాలు ఆచరించి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, నిత్యహోమం జరిపించారు. నిత్య కల్యాణంలో భాగంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తిగట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి
సూర్యాపేటటౌన్ : వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ కేటాయించింది మాత్రం 7 శాతం లోపే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెరగాలంటే బడ్జెట్ పెంచాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, సుదర్శన్, వెంకటయ్య, దేవేందర్, షేక్ ఉమర్, నాగన్న పాల్గొన్నారు.


