సూర్యాపేట అర్బన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం కోసం అమెరికా చేస్తున్న కుట్రలో భాగమేనని, దానికి మోదీ సర్కార్ వత్తాసు పలకడం సిగ్గుచేటని టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శిక్షణ తరగతులు శనివారం సూర్యాపేటలో కే సూర్యం అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీలకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, రాజన్న, రామయ్య, హన్మేష్, వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముత్తెన్న, యాకుబ్ షావలి, ప్రవీణ్ రాష్ట్ర కోశాధికారి కిరణ్, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, సుధాకర్, రాము, మధుసూదన్, పుల్లన్న, నరసింహ, రామ్ లక్ష్మణ్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొడ్డలి నర్సన్న, సయ్యద్ హుస్సేన్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.


