గోదావరి జలాల విడుదలలో ఆలస్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సరిపడా నీళ్లొదలాలని ఆత్మకూర్(ఎస్) మండల రైతులు మండలంలోని రామోజీతండా వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. రామోజీతండా ఎస్సారెస్పీ 22–ఎల్ కాలువ వద్ద ఏపూర్ ప్రధాన రహదారిపై 8 గ్రామాలకు చెందిన రైతులు సుమారు రెండు గంటలు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ చివరి పంటలకు నీళ్లు ఇస్తామంటూ చెబుతున్నా.. కనీసం కాలువల వెంట ఉన్న పంట పొలాలకు కూడా నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రెండు వారాలకు ఒకసారైనా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కలగజేసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రామోజీ తండా, పుప్పాలగూడెం, కోటపాడ్, ఆత్మకూరు, నసీంపేట, రామన్నగూడెం, తేట్టకుంట తండా, కాశీగూడెం గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.


