భానుపురి (సూర్యాపేట) : చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేయక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు కావస్తున్నా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చేయూత గ్యారెంటీ అమల్లోకి వస్తే పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే నిరుపేద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు ప్రయోజనం చేకూరనుంది.
నాలుగేళ్లుగా ఒక్కటీ లేదు..!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022, ఆగస్టులో 57 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు అర్హులైన వారికి ఒకేసారి అప్పటి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. ఆ తరువాత కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న వారిలో ఎవరైనా మృతి చెందితే వారి పెన్షన్లు నిలిపేస్తున్నారే తప్పా కొత్తవి మంజూరు చేయడం లేదు. జిల్లాలో కొత్తగా అన్ని రకాల చేయూత పింఛన్ల కోసం 20వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇందులో వృద్ధ్దాప్య, వితంతు పెన్షన్ల దరఖాస్తులు అధికంగా ఉన్నాయి.
పెంపు కోసం నిరీక్షణ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా చేయూత పెన్షన్లను పెంచుతామంటూ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక తమ పింఛన్లు పెరుగుతాయని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చేయూత పథకం కింద వృద్ధాప్య, వితంతు, ఇతర పెన్షన్లు రూ.4 వేలకు, దివ్యాంగుల పెన్షన్లు రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంచుతామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ ఊసే లేదు. ప్రభుత్వం పెన్షన్లు పెంచితే లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
ఫ కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఎదురు చూపులే
ఫ నాలుగేళ్లుగా నిలిచిన పెన్షన్ల మంజూరు
ఫ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
ఫ జిల్లాలో సుమారు 20వేల దరఖాస్తులు పెండింగ్


