నూతనకల్ : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్‌పై రూ.60లు పెంచడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల రాజేశ్వరి, కంచర్ల నర్సమ్మ, నాయకులు కునుకుంట్ల సైదులు, దేసోజు మధు, దగ్గుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


