భానుపురి : పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో పెడుతోందని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఈ నెల 12న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర సదస్సులో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, మేథావులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం సూర్యాపేట డిపో ఎదుట రాష్ట్ర సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్యుత్ బస్సుల విధానంతో ఆర్టీసీ, ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు పిచ్చయ్య, రవి, భాను, పూర్ణచందర్, సైదులు, నరసింహ, మధుసూదన్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


