సూర్యాపేట : ఉద్యమం రిజిస్ట్రేషన్ ద్వారా చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు లభిస్తాయని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బెనర్జీ తెలిపారు. ఉద్యమం రిజిస్ట్రేషన్‌పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం మండలంలోని బాలెంల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమం రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను వివరించారు. దీని ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చన్నారు. దాంతో పాటు శిక్షణ, మార్కెటింగ్ సహాయం వంటి ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. గ్రామీణ యువత, మహిళలు, చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలెంల కెనరా బ్యాంక్ మేనేజర్ వీరేంద్ర, రైతులు, యువత, మహిళలు పాల్గొన్నారు.


