ముందే ఎగవేతకు ప్లాన్..
సాధారణంగా వ్యాపారం చేసిన తరువాత నష్టం వస్తే దాన్ని తప్పించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు. జిల్లాలో సీఎంఆర్ దందాకు పాల్పడుతున్న మిల్లర్లు ప్రభుత్వం తమకు ధాన్యం కేటాయించే సమయంలోనే ఎగవేతకు ప్లాన్ సిద్ధం చేసుకుంటారని తోటి మిల్లర్లు అంటున్నారు. ప్రభుత్వం ధాన్యం కేటాయించిన సమయంలోనే మిల్లర్లు ధాన్యం బాగాలేదని.. దీనివల్ల తాము నష్టపోయే అవకాశం ఉందని అధికారులకు ఓ వినతిపత్రం ఇస్తారు. దానిమీద వారి సంతకం తీసుకుంటారు. ఈ విధంగా రెండు, మూడు వినతి పత్రాలు ఇచ్చి అధికారుల చేత వాటిమీద రిసీవ్డ్ సంతకం తీసుకుంటారు. ఇక వెంటనే తమ ప్లాన్ అమలు చేస్తారు. ఈ ధాన్యం మొత్తం బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటారు. ప్రభుత్వం సీఎంఆర్ ఇవ్వమని అడిగిన సమయంలో గతంలో తాము ఇచ్చిన వినతిపత్రాలను బయటకు తీస్తారు ‘మాకు మంచి ధాన్యం కేటాయించలేదు.. దీనిపై మీకు చెప్పినా పట్టించుకోలేదు.. దీంతో ఆ ధాన్యం మొత్తం పాడైపోయింది. కాబట్టి మేము సీఎంఆర్ ఇవ్వలేము’ అని చెబుతారు. ఇదే కాకుండా అధికారులు ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగించినప్పుడు ఈ వినతిపత్రాలను కోర్టుకు సమర్పించి ఊరట పొందుతున్నారని అధికారులు అంటున్నారు. దీనికి తమలో కొందరు అధికారులు సహకరించడం వల్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలు తీసుకోలేక పోతున్నామని, వారు దొడ్డిదారిని మళ్లీ ఇదే దందాకు పాల్పడుతున్నారని వారు అంటున్నారు.
కోదాడ : కష్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించిన ధాన్యం పక్కదారి పట్టించి ప్రభుత్వానికి కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన మిల్లర్లు తమ దందాను కొనసాగించడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒక జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లును అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నప్పటికీ అదే మిల్లర్ మరో జిల్లాకు వెళి్‌ల్ అక్కడ మూతపడిన రైస్ మిల్లులను లీజుకు తీసుకోవడం, కొనుగోలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తమకు అండగా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయించి భారీగా సీఎంఆర్ ధాన్యం కేటాయింప చేసుకుంటున్నారని ఇతర మిల్లర్లే ఆరోపిస్తున్నారు.
మిల్లర్ల దందా ఇలా..
● కోదాడలో సుమారు రూ.60 కోట్లకుపైగా విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లును అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం బయట అమ్ముకోవడంతో సదరు మిల్లుపై ప్రభుత్వం ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగించడంతో, మిల్లర్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతోపాటు ఆస్తులను ఇతరుల పేర్లపై బదలాయించారు. దీంతో ప్రభుత్వం సదరు మిల్లరు నుంచి పైసా కూడా వసూలు చేయలేక పోయింది. ఇదే మిల్లర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో మూతపడిన ఓ మిల్లును కొనుగోలు చేసి గతంలో సూర్యాపేట జిల్లాలో పనిచేసి ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి సాయంతో తాజాగా రూ.కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం తన మిల్లుకు కేటాయింపజేసుకొని దందా కొనసాగిస్తున్నాడని సమాచారం.
● కోదాడ మండల పరిధిలోని ఓ మిల్లర్ రూ.34 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించడంతో ఆయన మిల్లును అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. ఇతను కూడా తమ కుటుంబ సభ్యుల పేరుమీద ఆస్తులను భారీగా కొనుగోలు చేశాడని సమాచారం. ఇక ఈ మిల్లుకు రుణం ఇచ్చిన బ్యాంక్ బకాయి రాబట్టుకోవడానికి మిల్లును వేలం వేయగా గరిడేపల్లి, నేరేడుచర్ల, తుంగతుర్తిలో సీఎంఆర్ ఎగవేతకు పాల్పడిన మిల్లర్లు ఓ ఫోరం పేరుతో వేలంలో దక్కించుకొని సదరు మిల్లుపై మరో బ్యాంక్‌లో రుణం తీసుకొని సీఎంఆర్ దందాకు సిద్ధమమవుతున్నట్టు తెలిసింది.
తెర వెనుక ఉండి..
గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లు వాటి ఎగవేతకు పాల్పడి తాజాగా తెర వెనుక ఉండి ఈ దందాను సాగిస్తున్నారు. జిల్లాను దాటి పక్క జిల్లాలో మూత పడిన మిల్లులను, వ్యాపారం సరిగా చేయని మిల్లులను తమ బంధువులు లేదా గుమస్తాల పేరుతో కొనుగోలు చేస్తూ మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. ఎక్కడ తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన
మిల్లర్ల ఎత్తుగడ
అక్కడ మూతపడిన మిల్లులను
బంధువుల పేర్లతో కొనుగోలు
మళ్లీ సీఎంఆర్ దందా కొనసాగింపు


