అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం,నాగారం మండలం పేరబోయినగూడెంలోని మూసీనది క్వారీల నుంచి మూడు రోజుల క్రితం మళ్లీ ఇసుక సరఫరా ప్రారంభమైంది. ట్రాక్టర్ల యజమానులకు సుమారు నెలన్నరకు సంబంధించిన బిల్లులు ఇవ్వాల్సి ఉండడంతో వారు తమ ట్రాక్టర్లను క్వారీల వద్దకు తీసుకెళ్లడం లేదు. పైగా క్వారీల వద్ద నిఘా లేకపోవడంతో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో నెల రోజుల క్రితం ఈ రెండు క్వారీల నుంచి ఇసుక సరఫరాను నిలిపివేశారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా 45 రోజుల నుంచి ట్రాక్టర్ యజమానులకు రావాల్సిన బిల్లులు ఎట్టకేలకు విడుదల చేయడంతోపాటు గతంలో ఇసుక సరఫరా బాధ్యతలు రెవెన్యూ శాఖకు ఉండగా ప్రస్తుతం మైనింగ్ శాఖకు అప్పగించారు. దీంతో మైనింగ్ శాఖ ఈ రెండు క్వారీల నుంచి ఇసుక సరఫరాను పునరుద్ధరించింది. ఈ రెండు క్వారీల వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేసింది. ఆ శాఖ అధికారులు ఆ రెండు క్వారీల చుట్టూ సీసీ కెమెరాలను బిగించి సాండ్ టాక్సీ విధానంలో ఇసుక సరఫరా చేయిస్తున్నారు.
మూడువేల ట్రిప్పులకు పైగానే బుకింగ్
తుంగగూడెం, పేరబోయినగడెంలోని రెండు క్వారీల పరిధిలో ఇప్పటి వరకు 3 వేల ట్రాక్టర్ ట్రిప్పులకు పైగానే ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో ఇసుకను బుకింగ్ చేసుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం క్వారీలకు సెలవు ప్రకటించారు. తిరిగి బుధవారం క్వారీల నుంచి ఇసుక సరఫరా ప్రారంభంకానుంది. రెండు క్వారీల నందు రిజిస్టరైన సుమారు 500 ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా మొదలుకానుంది. అయితే ఈ రెండు క్వారీల నుంచి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు ఇసుక తరలించనున్నారు. ఇందుకుగాను స్థానిక రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
తుంగగూడెం, పేరబోయినగూడెం
క్వారీల నుంచి మళ్లీ మొదలు
పలు కారణాలతో నెలక్రితం నిలిపివేత
బిల్లుల విడుదలతో యథావిధిగా సరఫరా
మైనింగ్ శాఖకు బాధ్యతలు అప్పగింత
ఓటీపీ వచ్చాకే ట్రాక్టర్లతో క్వారీల వ ద్దకు
రావాలంటున్న అధికారులు
అక్రమాలకు పాల్పడొద్దు
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఇసుక–మన వాహనం పథకంలో ట్రాక్టర్ యజమానులు అవకతవకలకు పాల్పడొద్దు. ఓటీపీ వచ్చాకే ట్రాక్టర్లను క్వారీల వద్దకు తీసుకెళ్లాలి. అక్రమాలకు పాల్పడితే ట్రాక్టర్లను సీజ్ చేసి రిజిస్ట్రేషన్ రద్దుచేస్తాం. – బాషపాక శ్రీకాంత్,
తహసీల్దార్, జాజిరెడ్డిగూడెం


