సర్పంచులకు కొత్త అధికారాలు
భానుపురి (సూర్యాపేట) : పల్లెల్లో ఇటీవల కొలువుదీరిన సర్పంచులకు కొత్త అధికారాలను కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గ్రామాల్లోని అంగన్‌న్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి వాటి బాగోగులను పర్యవేక్షించే బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించింది. ఈ మేరకు సర్పంచులకు అధికారాలు అప్పగిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ కేంద్రాలను పటిష్టం చేయడం, విద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ..
అంగన్‌వాడీ కేంద్రాలపై ఇకనుంచి సర్పంచుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది. ప్రభుత్వం నుంచి కేంద్రాలకు సరఫరా అవుతున్న సరుకులు ప్రతినెలా వచ్చేలా పర్యవేక్షించడంతోపాటు చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందేలా సర్పంచులు చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఆరోగ్యలక్ష్మీ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందించే భోజనం నాణ్యతనూ తనిఖీ చేస్తారు. పిల్లలు, గర్భిణులతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేవారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి లక్షల రూపాయల విలువ చేసే సరుకులు నెలనెలా సరఫరా అవుతున్నాయి. అవి పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సరుకులు పక్కదారి పట్టకుండా సర్పంచులు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. బాలామృతం, పాలు, గుడ్లు, బియ్యం, కందిపప్పు, తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూస్తారు. అంగనన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల భద్రత, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి బాధ్యతలను సర్పంచ్‌లు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇకమీదట అలా జరగకుండా పర్యవేక్షణ కమిటీలు గుర్తించి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. ఇందుకు నెలకోసారి సమావేశాలు నిర్వహించడంతోపాటు రికార్డుల్లో సంతకాలు చేయాల్సి ఉంటుంది.
సర్పంచ్ చైర్మన్ గా..
అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసే కమిటీలకు చైర్మన్‌గా సర్పంచ్ వ్యవహరిస్తారు. కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. కన్వీనర్‌గా అంగన్‌వాడీ టీచర్, సామాన్య శాస్త్రం బోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, విశ్రాంత ఉద్యోగి ఒకరు, ఏఎన్‌ఎం, చిన్నారుల తల్లులు సభ్యులుగా ఉంటారు. మున్సిపాలిటీల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను మినహాయించి, అన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని కేంద్రాలకు సర్పంచ్ చైర్మన్‌గా ఉంటారు.
జిల్లాలో 1,209 సెంటర్లు..
సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్, చివ్వెంల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటి పరిధిలో మొత్తం 42,036 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వాటిలో సుమారు 40 శాతం మేర అంగన్‌వాడీ సెంటర్లు పట్టణాల పరిధిలో ఉండగా, 60 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను సర్పంచులు పర్యవేక్షించనున్నారు.
అంగన్‌వాడీల పర్యవేక్షణ,
పటిష్టం చేసే బాధ్యత
సర్పంచ్ చైర్మన్‌గా కమిటీల ఏర్పాటు
ఇటీవల ఉత్తర్వులు
జారీ చేసిన ప్రభుత్వం


