ఆధునిక హంగులతో ఇందిరమ్మ ఇళ్లు
కోదాడ రూరల్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న రూ.5 లక్షలకు తోడు లబ్ధిదారులు మరికొంత నగదు సమకూర్చుకుని ఇళ్లను అద్భుతంగా తీర్చిదిద్దుకుని తమ సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు.
579 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం
కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి మొదటి విడతలో మొత్తం 1,030 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 579 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అనంతగిరి మండలంలోని లక్కరవం గ్రామంలో 142 ఇళ్లు మంజూరు కాగా.. 100 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. అదేవిధంగా చిలుకూరు మండలంలోని ఆర్లెగూడెంలో 156 ఇళ్లకుగాను 45 ఇళ్లు, కోదాడ మండలం గుడిబండలో 196 ఇళ్లకుగాను 98, మోతె మండలంలోని విభాళాపురంలో 156 ఇళ్లకుగాను 97, మునగాల మండలంలో తాడ్వాయిలో 156 ఇళ్లకుగాను 86, నడిగూడెం మండలంలోని కెఆర్సీపురంలో 224 ఇళ్లకుగాను 153 ఇళ్లను లబ్ధిదారులు నిర్మించుకుంటున్నారు. వీటిలో 90 శాతం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కాగా వారికి చివరి విడత రూ.లక్ష బిల్లు రావాల్సి ఉంది.
అన్ని హంగులతో..
ప్రభుత్వం అందజేసే నగదుతోపాటు లబ్ధిదారులు కొంత నగదు కలుపుకుని సకల సౌకర్యాలతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకుంటున్నారు. కానీ అధికారుల అనుమతితో ఇంటీరియల్ వర్క్, మార్బుల్, టైల్స్, గ్రానైట్, గోడలకు వాల్‌పుట్టి, సీలింగ్, ఎలివేషన్ డిజైన్‌లు, రంగులతోపాటు కిచెన్‌లను మహిళలు తమకు నచ్చినట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఆరు మండలాల్లో పైలట్
ప్రాజెక్టుగా 1030 మంజూరు
ముమ్మరంగా ఇళ్ల నిర్మాణాలు
ఇంటీరియర్ డిజైన్ కోసం అదనంగా వెచ్చిస్తున్న లబ్ధిదారులు
ఆధునిక హంగులతో ఇందిరమ్మ ఇళ్లు


