ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
ఫ మొదటి రోజు 245 మంది గైర్హాజరు
సూర్యాపేట టౌన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి రోజు మొత్తం 7,312 మంది విద్యార్థులను గాను 7,067 మంది హాజరు కాగా 245 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 5,861 మందికి 5,716 మంది హాజరు కాగా 145 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విభా గంలో 1,451 మందికి 1,351 మంది పరీక్ష రాయగా 100 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అలాగే ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీలు చేశారు. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్ష నిర్వహించారు.
విద్యార్థులకు ఉపాధి
కల్పనే లక్ష్యం
సూర్యాపేట టౌన్ : కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేషులు అన్నారు. గురువారం కళాశాలలో టాటా క్యాపిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ (జాబ్‌మేళా) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని హెచ్‌ఆర్ స్టేట్ మేనేజర్ ఎం.మాలతీ, విగ్నేశ్వరన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న 78 మంది విద్యార్థులు పాల్గొనగా 33 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ స్టేట్ మేనేజర్ వి.శ్రీనివాసరావు, ఏరియా సేల్స్ మేనేజర్ జి.ఉప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంజీయూ రిజిస్ట్రార్‌గా కొప్పుల అంజిరెడ్డి
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) రిజిస్ట్రార్‌గా ఆర్థికశాస్త్ర విభాగం ప్రొఫెసర్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్ కొప్పుల అంజిరెడ్డి నియమితులయ్యారు. 2007లో ఎంజీ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన అంజిరెడ్డి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పేరుంది. అంజిరెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామం. రిజిస్ట్రార్‌గా నియమితులైన అంజిరెడ్డిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు.
అంధ విద్యార్థులకు
ప్రత్యేక లైబ్రరీ
రామగిరి(నల్లగొండ) : అంధ విద్యార్థుల కోసం నల్లగొండ జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజిటల్ లైబ్రరీ కార్నర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్‌ఖాన్ గురువారం ప్రారంభించారు. ఇందులో బ్రెయిలీ పుస్తకాలు, ఆడియో బుక్స్, ఈ బుక్స్, స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్లు సదుపాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి బాలమ్మ, అనిల్‌కుమార్, కృష్ణమోహన్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం


