విరామం.. వినియోగించుకుంటే విజయం
విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం
సూర్యాపేటటౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి ఏడాది వారం, పది రోజుల్లో పూర్తవుతుంటాయి. ఈ ఏడాది రాష్ట్ర విద్యాశాఖ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పేపర్, పేపర్‌కు కనీసం మూడు రోజుల విరామం ఉండేవిధంగా టైం టేబుల్ సిద్ధం చేశారు. ఈ సమయంలో విద్యాశాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్యార్థులను సన్నద్ధం చేయనున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి 24వ తేదీన పూర్తి కానున్నాయి.
విద్యార్థుల సన్నద్ధతకు ప్రత్యేక ప్రణాళిక
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. సమాధాన పత్రాలను ఆలస్యం చేయకుండా మూల్యాంకనం చేపట్టి విశ్లేషణ చేయడం, ప్రశ్నల వారీగా అంచనా, సమాధాన పత్రాలను రాసే సరైన విధానం, విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులను ఉపాధ్యాయులు వివరించడం, మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాలను విద్యార్థుల తల్లిదండ్రులను పంపించడం, విద్యార్థి ప్రగతిపై అవగాహన కల్పించడం వంటివి చేయనున్నారు. ప్రీఫైనల్ పరీక్షల అనంతరం ఉత్తీర్ణత కాని, సగటు మార్కులు తెచ్చుకున్న, మంచి ప్రగతిని చూపిన విద్యార్థులకు అనుగుణంగా విద్యా వ్యూహాలను అమలు చేయనున్నారు.
జిల్లాలో 7205 మంది పదో తరగతి విద్యార్థులు
జిల్లాలో 171 జెడ్పీ పాఠశాలలు, ఏడు ప్రభుత్వ ఉన్నత, రెండు ఎయిడెడ్, 18 కేజీబీవీ, 9 గురుకులాలు, మూడు రెసిడెన్షియల్స్, ఎనిమిది సోషల్ వెల్ఫేర్, తొమ్మిది మోడల్ స్కూల్స్, ఏడు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 7,205 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నవంబర్ నుంచే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో రెండు నుంచి మూడు ముఖ్యమైన భావనలను వివరిస్తున్నారు. అలా. స్వయంగా చదవడం, రాత సాధన చేసేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేస్తున్నారు.
భానుపురి (సూర్యాపేట) : పదో తరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు పూర్తి అవగాహనతో పనిచేయాలని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులతో ఒరియంటేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల భద్రత, రవాణా, సీలింగ్– అన్ సీలింగ్ విధానం, పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్ల సమన్వయం వంటి అంశాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, ఫస్ట్ ఎయిడ్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం స్క్రైబ్ సౌకర్యం, అవసరమైన చోట వీల్‌చైర్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ప్రభుత్వ పరీక్ష విభాగం అసిస్టెంట్ కమిషనర్ సీనయ్య పాల్గొన్నారు.
ఫ మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు
పదో తరగతి వార్షిక పరీక్షలు
ఫ ఒక్కో పేపర్‌కు కనీసం
మూడు రోజుల సమయం
ఫ విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించాలన్న ఆలోచనతో నూతన విధానం
పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను ప్రణాళిక ప్రకారం సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా అందులో విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరీక్షకు, పరీక్షకు మధ్యలో మూడు రోజులు విరామ సమయం ఉంది. ఇది పరీక్ష ప్రిఫరేషన్‌కు దోహదపడుతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి.
– అశోక్, డీఈఓ
విరామం.. వినియోగించుకుంటే విజయం


