సమస్యలు తొలగేనా!
పునర్విభజన..
ప్రస్తుతం కొత్త మండలాల ఏర్పాటుకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
● గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం, మోతె మండలంలోని ఉర్లుగొండ లేదా రావిపహాడ్, మునగాల మండలంలోని రేపాల గ్రామాలను మండలాలుగా చేయాలన్న డిమాండ్ వస్తోంది.
● ప్రస్తుతం మాడుగులపల్లి మండలంలో ఉన్న పూసలపాడ్, గజలాపురం, అభంగాపురం గ్రా మాలను తిరిగి త్రిపురారం మండలంలో కలపాలని, కన్నెకల్, ధర్మాపురం గ్రామాలను నిడమనూరు కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫ జిల్లాల పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం
ఫ ప్రస్తుతం రెవెన్యూ ఒక మండలంలో, శాంతిభద్రతలు మరో మండలంలో..
ఫ కొన్ని మండలాల భౌగోళిక రూపు అస్తవ్యస్తం
ఫ జిల్లాల పునర్విభజనతో ఇలాంటి ఇబ్బందులు తొలగుతాయని భావన
ఫ తెరపైకి కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల డిమాండ్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలు, మండలాల భౌగోళిక హద్దులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రెవెన్యూపరంగా పాలన ఒక మండలం పరిధిలోకి వస్తే, శాంతిభద్రతలు మరో మండల పరిధిలో ఉన్నాయి. రెండు మూడు జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను తెరపైకి తెచ్చింది. కొన్ని జిల్లాలు, డివిజన్ల పునర్విభజనే సరిగా లేదని, వాటిని సరిచేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు జిల్లాలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటు డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి.
2016లో జిల్లాల పునర్విభజన
రాష్ట్రంలో 2016లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. పూర్వ నల్లగొండ జిల్లా మూడు జిల్లాలుగా నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. వాటితోపాటే రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలను చేసింది. అయితే అప్పట్లో చేసిన పునర్విభజన సరిగ్గా లేదని, వాటిని సరిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
పాలనాపరంగా ఇబ్బందులు
పలు మండలాలు, గ్రామాల్లో ప్రజలకు పాలనపరంగా ఇబ్బందులు తప్పడం లేదు. మాడుగులపల్లి మండలం కొత్తగా ఏర్పడింది. నిడమనూరు, త్రిపురారం మండలాల్లోని 10, తిప్పర్తి మండలంలో 5 గ్రామాలు, వేములపల్లి మండలంలో 13 గ్రామాలు తీసుకుని మాడుగులపల్లి మండలం ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల డిమాండ్ తెరపైకి వచ్చింది. మిర్యాలగూడను జిల్లా చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చినా ఆచరణకు నోచుకోలేదు. అదే సమయంలో నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలను కలిపి నల్లమల జిల్లా ఏర్పాటు చేయాలని అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. అదీ ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు ఆలేరు, మోత్కూరును రెవెన్యూ డివిజన్లు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనూ పెట్టింది. అయినా అమలుకు నోచుకోలేదు. నకిరేకల్‌ను డివిజన్ చేయాలని ఇటీవల ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో మాట్లాడుతూ కోరారు. ఇదే క్రమంలో అప్పట్లో కొన్ని మండలాలను అవసరం లేకున్నా అసంబద్దంగా ఏర్పాటు చేశారన్న వాదన ఉంది. ఆయా మండలాలను రద్దుచేయవచ్చన్న చర్చ జరుగుతోంది.


