షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్
సూర్యాపేటటౌన్ : వాహన రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం కానున్నాయి. తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్), పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇకపై షోరూంలోనే చేయనున్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను రవాణా శాఖ షోరూం డీలర్లకు అప్పగించనుంది. ఈ ప్రక్రియ వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. నూతన విధానం ద్వారా వాహన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి.
ఏజెంట్ వ్యవస్థకు అడ్డుకట్ట
రవాణా శాఖ తీసుకువస్తున్న నూతన విధానం ద్వా రా ఏజెంట్ వ్యవస్థకు అడ్డుకట్ట పడనుంది. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వాహనదారులకు సేవలు అందనున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా, తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే ఈ నూతన విధానం అమలుపై రవాణా శాఖ కసరత్తు పూర్తి చేసింది. విధివిధానాలు ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
సమయం.. ఖర్చు ఆదా
వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పన్నులను షోరూం డీలర్లు ముందుగానే వసూలు చేస్తున్నా.. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఇచ్చేవారు. డీలర్లు ఇచ్చిన అన్ని పత్రాలు తీసుకొని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. రాకపోకలు, రవాణా ఖర్చులు, సమయం వృథా అయ్యేది. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా ఉండేది. ఇకపై ఆ సమస్య తీరనుంది. డీలరు వద్దే వాహనం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కానుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం ఆర్‌సీ పోస్టల్ ద్వారా నేరుగా వాహనదారుడికి ఇంటికి వస్తుంది. నూతన రిజిస్ట్రేషన్ విధానంపై వాహనదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
సాఫ్ట్‌వేర్ రాగానే ప్రారంభం
డీలర్ల వద్దనే వాహనాల రిజిస్ట్రేషన్ చేయనున్నారు. తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చాక ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. – జయప్రకాష్‌రెడ్డి,
జిల్లా రవాణాశాఖ అధికారి
వచ్చే నెల నుంచి అమలు
డీలర్లకు బాధ్యతల అప్పగింత
వాహనదారులకు సులువు కానున్న సేవలు
నెలకు 400కు పైగా రిజిస్ట్రేషన్లు
జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలైన కోదాడ, హుజుర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల తదితర ప్రాంతాల్లో అన్ని రకాల వాహనాల షోరూంలు ఉన్నాయి. వీటి పరిధిలో రోజూ పదుల సంఖ్యలో వాహనాల అమ్మకాలు జరుగుతుంటాయి. ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వాహనాలు రోజూ 20కి పైగా ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నెలకు 400 వాహనాలకు పైగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. డీలర్లకే రిజిస్ట్రేషన్‌బాధ్యతలు అప్పగించడం వల్ల వాహనదారులు రవాణా శాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడంతోపాటు అధికారులు, సిబ్బందికి పని ఒత్తిడి తగ్గుతుంది.


