కంట్రోల్ రూమ్ విధులు కీలకమైనవి
సూర్యాపేటటౌన్ : సిబ్బందిని సమన్వయం చేయడంలో పోలీస్ కంట్రోల్ రూమ్ విధులు కీలకమైనవని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ సెంట్రల్ కంట్రోల్ రూమ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ల పనితీరును శుక్రవారం ఆయన పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. డయల్ 100, పెట్రో కార్, నైట్ పెట్రోలింగ్, హైవే పెట్రోలింగ్, బ్లూ కోట్స్, బీట్ డ్యూటీలను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రమాదాలు సంభవించినా, సమస్యలు వచ్చినా 100 నంబర్‌కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఫిర్యాదుల పట్ల వేగంగా స్పందించి బాధితులకు సేవలందించాలని స్పష్టం చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అనుమానిత కదలికలు గమనిస్తూ పోలీసులకు సమాచారం అందించి నేరాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రతి అంశాన్ని సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని, వేగంగా సేవలందించడం వల్ల జిల్లా పోలీసులకు గుర్తింపు వస్తుందన్నారు.
తిరుగుప్రయాణంలో జాగ్రత్తలు తప్పనిసరి
సంక్రాంతి పండగకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రా ప్రాంతానికి తరలివెళ్లిన ప్రజానీకం తిరుగు ప్రయాణంలోనూ జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు విస్తరణ, ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున సురక్షితంగా గమ్యం చేరాలన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌జామ్ ఏర్పడకుండా, అవసరం మేరకు వాహనాలను మళ్లి స్తామన్నారు. డ్రోన్, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడపడితే అక్కడ రోడ్లు దాటకూడదని, పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, పశువులని రోడ్లపైకి వదల వద్దని కోరారు.
ఫ ఎస్పీ నరసింహ


