గోదావరి పరవళ్లు
అర్వపల్లి: యాసంగి సీజన్‌కు గాను ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ పరిధిలోని 71–డీబీఎం కాలువకు గోదావరి జలాల విడుదల కొనసాగుతోంది. ఈనెల 7న నీటిని వదిలారు. 14వ తేదీ వరకు వారబంధి విధానంలో నీళ్లు రావాల్సి ఉండగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే వారబంధి పద్ధతిలో కాకుండా నిరంతరాయంగా నీటిని ఇవ్వాలిని అధికారులకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్మిక చట్టాలను రద్దు చేయాలి
సూర్యాపేట అర్బన్: కార్మిక, కర్షక, గ్రామీణ ప్రజలను ఉపాధికి దూరం చేసే లేబర్‌కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, జిల్లా గౌరవ అధ్యక్షుడు దంతల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కొలిశెట్టి యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, కిసాన్ మోర్చ(ఎస్‌కేఎం) సంయుక్తంగా నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఉపాధిహామీ చట్టంలో చేసిన మార్పుల వల్ల రాష్ట్రాలపై భారం పడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నజీర్, ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, పోలేబోయిన కిరణ్, నాయకులు బండి రవి, వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్య కల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహులను దివ్యమనోహరంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిత్యకల్యాణం వైభవంగా జరిపించారు.కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
యాదగిరీశుడికి ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట : పంచనారసింహుడు కొలువైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆండాళ్ దేవికి ఊంజల్ సేవను అర్చకులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం జరిపించారు.
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. శుక్రవారంతో సెలవులు ముగియడంతో 17వ తేదీన పునఃప్రారంభం కానున్నాయని డీఈఓ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
గోదావరి పరవళ్లు
గోదావరి పరవళ్లు


