మేళ్లచెరువు : మేళ్లచెరువులోని మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో కొనసాగుతున్న శ్రీదేవిభూదేవి శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కనుల పండువగా చక్రస్నానం నిర్వహించారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి పర్యవేక్షణలో మహాపూర్ణాహుతి, శ్రీ చక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలు చేపట్టారు. ఉదయం యాగశాలలో పూర్ణాహుతి సందర్భంగా దేవతలను సుగంధ ద్రవ్యాలతో ఆరాధించి పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతికోసం మహపూర్ణాహుతి నిర్వహించినట్లు జీయర్‌స్వామి తెలిపారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి పూజలు నిర్వహించి అనంతరం దేవతామూర్తులను ఊరేగిస్తూ రంగులు చల్లుకుంటూ పుష్కరిణి వద్దకు చేరుకొని చక్రస్నానం వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, మునగాల రామ్మోహనరావు, అరుణ దంపతులు, జూపల్లి వినోద్‌రావు, భార్గవి దంపతులు, రంజిత్‌రావు, చంద్రశేఖరపాండే, భారత చీఫ్‌విజిలెన్స్ మాజీ ఆఫీసర్ కె.వి.చౌదరి, కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, ఎస్‌ఐ పరమేష్, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


