60+ సాహస యాత్ర! | Baby Boomer tourism | Sakshi
Sakshi News home page

60+ సాహస యాత్ర!

Published Tue, Apr 29 2025 5:51 AM | Last Updated on Tue, Apr 29 2025 5:51 AM

Baby Boomer tourism

అరవైల్లో పడ్డాక ఇక జీవితం అయిపోయిందనే రోజులు పోయాయ్‌! అమ్మమ్మలు.. తాతయ్యలు కూడా ఇప్పుడు అంటార్కిటికా నుంచి అగ్నిపర్వతాల దాకా... యూరప్‌ నుంచి జపాన్‌ దాకా.. ప్రపంచాన్ని చుట్టేసేందుకు సై అంటున్నారు. అంతేకాదు స్కైడైవింగ్‌ మొదలు స్కీయింగ్‌.. శాండ్‌ సర్ఫింగ్‌.. ఎలాంటి సాహసాలకైనా తగ్గేదేలే అంటున్నారు. అడ్వెంచర్‌ టూర్ల విషయంలో యువతతో పోటీ పడుతుండటంతో బేబీ బూమర్స్‌(Baby Boomer) (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారు) పర్యాటకం ఇప్పుడు ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉంది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

జీవితాన్ని ఎంజాయ్‌ చేయడానికి వయసుతో పనేముందని నిరూపిస్తున్నారు బేబీ బూమర్స్‌. కుటుంబ బాధ్యతలతో తాము కోరుకున్న ఆనందాలను దూరం చేసుకున్న వారెందరో ఉంటారు. అయితే, అరవైల్లో మళ్లీ నలభై వచ్చింది.. అంటూ ప్రపంచ పర్యటనలకు సైతం సిద్ధమైపోతున్న వారు ఇటీవల బాగా పెరుగుతున్నారు. దీంతో ట్రావెల్‌ పరిశ్రమ కూడా ప్రత్యేక ప్యాకేజీలతో మరింత ప్రోత్సహిస్తోంది. సెగ్జాజెనేరియన్స్‌ (60–69 ఏళ్ల వయసు), సెప్టువాజెనేరియన్స్‌ (70–79 ఏళ్ల వయసు) ఆక్టాజెనేరియన్స్‌ (80–89 ఏళ్ల వయసు) ఇలా అన్ని వయసుల వారికీ ట్రావెల్‌ కంపెనీలు అనువైన ప్యాకేజీలను అందిస్తున్నాయి.

అంటార్కిటికా నుంచి అగ్నిపర్వతాల దాకా...
⇒ ప్రపంచాన్ని చుట్టేస్తున్న సీనియర్‌ సిటిజన్స్‌
⇒ అడ్వెంచర్‌ యాక్టివిటీలకూ సై...
⇒ ప్రత్యేక సదుపాయాలు, డిస్కౌంట్లతో ప్రోత్సహిస్తున్న ట్రావెల్‌ సంస్థలు

ఏ సాహసానికైనా రెడీ
కేవలం ప్రపంచ యాత్రలే కాదు అడ్వెంచర్‌ ట్రావెల్‌కు కూడా బేబీ బూమర్స్‌ ఎగిరి గంతేస్తున్నారు. బుకింగ్స్‌ డాట్‌ కామ్‌ ‘ట్రావెల్‌ ప్రిడిక్షన్స్‌–2025’ సర్వే ప్రకారం అత్యంత సాహసంతో కూడిన యాక్టివిటీలకు మొగ్గు చూపుతున్న బేబీ బూమర్స్‌ 30 శాతానికి ఎగబాకారు. 2024లో ఈ సంఖ్య 11 శాతం మాత్రమే. వయసు గురించి ఆలోచించకుండా ప్రతి నలుగురు బేబీ బూమర్స్‌లో ఒకరు ఇలాంటి అడ్వెంచర్లంటే మక్కువ చూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ప్రత్యేక డిస్కౌంట్లు
సీనియర్‌ సిటిజన్స్‌ విదేశీ పర్యటన బుకింగ్స్‌లో ఏటా 20 శాతం వృద్ధి నమోదవుతు­న్నట్లు ట్రావెల్‌ పోర్టల్‌ ఈజ్‌మైట్రిప్‌ సీఈఓ రికాంత్‌ పిట్టీ పేర్కొన్నారు. 2021తో పోలిస్తే బుకింగ్స్‌ ఏకంగా మూడు రెట్లు పెరిగాయ­న్నారు. కాగా, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక డిస్కౌంట్లనూ ఈ సంస్థ అందిస్తోంది. రిలాక్స్‌ అయ్యేందుకు కేరళ బ్యాక్‌ వాటర్స్, గోవా బీచ్‌లను ఎంచుకుంటున్నారు. ఇక ప్రకృతిలో సేద తీరేందుకు ఈశాన్య భారతాన్ని ఎక్కువగా చుట్టేస్తున్నారు.

చలో అంటార్కిటికా...
ఉత్తర ధ్రువం వద్ద నార్తర్న్‌ లైట్స్, అంటార్కిటికా క్రూజ్‌ యాత్రలకూ ఇటీవల ఆసక్తి పెరిగిందని సీనియర్‌ సిటిజన్స్‌ ట్రావెల్‌ స్పెషలిస్ట్‌ సంస్థ ‘కరేవాయేజ్‌’ పేర్కొంది. సంప్రదాయేతర, సాహసోపేతమైన గమ్యస్థానాలకు మొగ్గు చూపేవారు 2021తో పోలిస్తే 2024లో మూడింతలు పెరిగారని చెప్పింది. ఏటా 10వేల మందికి పైగా డిమాండ్‌ ఉన్నప్పటికీ, మంచి పర్యాటక అనుభూతిని అందించే లక్ష్యంతో తాము అంతకు మించి బుకింగ్స్‌ అనుమతించడం లేదని కంపెనీ ఫౌండర్‌ షెఫాలీ జైన్‌ మిశ్రా తెలిపారు. గతేడాది ఈ సంస్థ 10 మంది సీనియర్‌ సిటిజన్స్‌ బృందంతో 10 రోజుల అంటార్కిటికా ట్రిప్‌ నిర్వహించింది. జపాన్‌ చెర్రీ బ్లోసమ్స్, ఫిన్లాండ్‌ వింటర్‌ ల్యాండ్‌స్కేప్స్, నార్వే నార్తర్న్‌ లైట్స్, ఐస్‌లాండ్స్‌ క్రూజ్‌ యాత్రలు, యూరప్‌ రివర్‌ సెయిలింగ్స్‌ వంటి ప్రత్యేక టూర్లనూ ఈ సంస్థ అందిస్తోంది.

ఆర్థికంగా స్థిరపడటం ప్లస్‌
ఖర్చులన్నీ పోను అదనంగా వెచ్చించగలిగే ఆదాయం దండిగా ఉండటం, కుటుంబ బాధ్య­తలన్నీ తీరిపోవడంతో ప్రపంచాన్ని చుటి­్టరావాలన్న తమ కోరికలను తీర్చుకో­వడానికి సీనియర్‌ సిటిజన్స్‌ ప్రాధాన్యమి­స్తున్నారని పిట్టీ చెప్పారు. ‘రిటైర్మెంట్‌ తర్వాత తగినంత సమయం దొరకడంతో కొత్త ప్రదేశాలను చుట్టొచ్చేందుకు వీలవుతోంది. 51 శాతం మంది బేబీ బూమర్స్, 39 శాతం మంది సైలెంట్‌ జెనరేషన్‌ (80 ఏళ్ల పైబడిన వారు) జీవితకాలంలో ఒక్కసారైనా చూడా­ల్సిన టూర్లకు మొగ్గు చూపుతున్నారు’ అని వివరించారు. కాగా, విమానాలు, రైలు చార్జీల్లో డిస్కౌంట్లు.. ఎయిర్‌పోర్టుల్లో ర్యాంపులు, ఎలివేటర్‌ సదుపా­యాలు ఉండటం వల్ల వారు పర్యటనలకు ముందుకొ­స్తున్నారని భారతీయ టూరిజం, హాస్పిటా­లిటీ అసోసియేషన్ల ఫెడరేషన్‌ (ఎఫ్‌ఏఐటీహెచ్‌) బోర్డు సభ్యుడు, టూర్‌వాలా ఎండీ వేద్‌ ఖన్నా అభిప్రాయప­డ్డారు. నిపుణులైన టూర్‌ గైడ్‌లు, జర్నీలో వైద్యుల తోడ్పాటు వంటి సదుపాయాలతో ప్రత్యేకంగా ప్యాకేజీలను తీర్చిదిద్దుతుండటం వల్ల కూడా డిమాండ్‌ పెరిగిందన్నారు.

అవీ ఇవీ
⇒ సీనియర్స్‌ మక్కువ చూపుతున్న ప్రఖ్యాత ప్రపంచ నగరాలు: టోక్యో, సియోల్, సింగపూర్, లండన్‌
⇒ ప్రఖ్యాత పుణ్య క్షేత్రాలు: వారణాసి, అయోధ్య, హరిద్వార్, రిషికేష్, రామేశ్వరం, పూరి, తిరుపతి
⇒ సీనియర్‌ సిటిజన్స్‌ ట్రావెల్‌ బుకింగ్స్‌లో వృద్ధి: 20%
⇒ 2023లో ప్రపంచవ్యాప్తంగా సీనియర్‌ సిటిజన్స్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ విలువ: 3.2 బిలియన్‌ డాలర్లు (రూ.27వేల కోట్లు)

(2032 నాటికి ఇది 16.7 బిలియన్‌ డాలర్లకు చేరుతుందనేది అలైట్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ అంచనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement