శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితపేటల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు. కుల వివక్షకు వ్యతిరేకంగా దళితుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం పేరుతో ఛలో కలెక్టరేట్ సోమవారం నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాద్, గంగారాపు సింహాచలం, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరావులు మాట్లాడుతూ.. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో దళితుల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పేటల్లో కనీసం మంచినీరు, సరైన డ్రైనేజీ వంటి సౌకర్యాలు కూడా లేవన్నారు. అనేక గ్రామాల్లో శ్మశానవాటికకు రహదారి సౌకర్యం లేక పంట పొలాల మధ్యలో నుంచి భౌతికకాయాన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, దళిత పేటల్లో మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని, దళిత యువకులకు స్వయం ఉపాధిని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి.ఈశ్వరమ్మ, కొల్లి ఎల్లయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, వివిధ సంఘాల నాయకులు కె.మోహనరావు, ఎన్.షణ్ముఖరావు, ఎన్.గణపతి, హెచ్.ఈశ్వరరావు, అల్లు సత్యనారాయణ, నిమ్మక అప్పన్న, కుప్పిలి గోపి, పనస రమేష్, బి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.


