● ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన వ్యతిరేక విధానాలను విడనాడాలని, ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బుధవారం ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని పాలకులు చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం యువత చేతుల్లో ఉద్యోగ నియామక పత్రాల కంటే ఉద్యోగ దరఖాస్తులు, హాల్‌టికెట్లు, కోచింగ్ ఫీజు రశీదులు, విద్యా రుణాల పత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకులు, ఫలితాల జాప్యం, నియామక ప్రక్రియలో అవకతవకలు కారణంగా యువత తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం ప్రతిఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలని, లేనిపక్షంలో నెలకు రూ.3,000ల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలోని ఎస్‌ఐ, కానిస్టేబుల్స్, హోంగార్డ్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి యువత వలసలను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్.అరవింద్, అన్నాజీ, వసంత్, హరి, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు


