అవి నిషేధిత భూములే. అక్కడ లేఅవుట్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ భూము లకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. నాట్ టేకింగ్ ఓవర్ భూముల జాబితాలో ఈ భూములు ఉన్నాయి. ఇవే కాకుండా సుమారు 200 ఎకరాల వరకు ఇలాంటి భూములు ఉన్నాయి. కోర్టు ఆదేశాల వస్తే తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోలేం.
– ఎస్.రాంబాబు, తహసీల్దార్,
ఆమదాలవలస
బావాజీ మఠం భూముల్లో వేసిన అక్రమ లేఅవుట్
మఠం భూములపై ఎమ్మెల్యే కన్ను
బావాజీ మఠం భూములపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కన్ను పడింది. ఆయన అనుచరులే బినామీలగా అవతారమెత్తి అక్రమ లేఅవుట్ వేశారు. స్థలాల విక్రయాలు చేపడుతున్నారు. అంతేకాకండా అక్రమ లేఅవుట్‌కు ఎమ్మెల్యే ఆదేశాలతో రూ. కోటి 45లక్షల ఉపాధి నిధులతో రోడ్లు, కాలువలు వేశారు. వీటిని అధికారులు అడ్డుకోవాలి. కలెక్టర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశాం.
– చింతాడ రవికుమార్, వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త, ఆమదాలవలస
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే శిక్షిస్తామని అధికారులు చెప్పాలి. అవి నిషేధిత జాబితాలో ఉంటే ఆక్రమణలను అడ్డుకోవాలి. అక్రమ లేఅవుట్లు వేస్తే వాటిని వెంటనే తొలగించాలి. కానీ ఇక్కడ విచిత్రంగా అక్రమ లేవుట్‌లకు పాలకులు, అధికారులే సహకరిస్తున్నారు. ఉపాధి హామీ నిధులతో రోడ్లేసి ఆక్రమణదారులకు వంతపాడుతున్నారు. అడిగితే ప్రజల కోసం ఎమ్మెల్యే కూన రవికుమార్ సిఫార్సు మేరకు రోడ్లు వేశామని చెబుతున్నారు.
మఠం భూముల్లో అక్రమ లేఅవుట్..
ఆమదాలవలస–శ్రీకాకుళం మార్గంలో తోటాడ–అక్కివరం రెవెన్యూ పరిధిలో బావాజీ మఠం భూము లు ఉన్నాయి. సర్వే నంబర్ 121లో దాదాపు 400 ఏళ్ల చరిత్ర గల 199 ఎకరాల భూముల్ని సదావత్తుకు (అన్నదానం కోసం) అప్పట్లో కేటాయించా రు. వీటిని భద్రంగా కాపాడాల్సిన అఽధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మఠం భూములు ఆక్రమణల పాలవుతున్నాయి. పచ్చ నాయకులు కొందరు ముఠాలుగా ఏర్పడి అఽధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆక్రమించుకుంటూపోతున్నారు. ఇప్పటికే 90 ఎకరాల వరకు ఆక్రమణల పాలయ్యాయి. అడ్డుకునేవారు లేకపోవడంతో మఠం భూములు కబ్జాకు గురవుతున్నా యి. కబ్జా చేసిన భూముల చుట్టూ ప్రహరీలు కట్టి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడక్కడే సుమారు 5ఎకరాల భూముల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఏకంగా లేఅవుట్ వేసేశారు. ఆ లేవుట్‌కు ఎలాంటి అనుమతులు లేవు. అక్రమంగా లేవుట్ వేయడమే కాకుండా స్టాంపు పేపర్లపై అనధికారికంగా విక్రయాలు జరుపుతున్నారు.
కబ్జాదారుల అడుగులకు మడుగులు
ఆక్రమిత భూముల్ని కాపాడాల్సిన అధికారులు చోద్యం చూడటమే కాకుండా కబ్జాదారులకు మరింత సహకరిస్తున్నారు. అధికార పార్టీ కీలక నేత ఆక్రమణదారుల వెనక ఉండటంతో అధికారులు వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఆ భూము లు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిందిపోయి అక్రమంగా వేసిన లేఅవుట్‌కు ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్లు, కాలువలు నిర్మించారు. రూ.కోటి 45 లక్షల నిధులను కబ్జా దారుల ప్ర యోజనాలకు ఖర్చు చేస్తున్నారు. రోడ్లు, కాలువలు వేశాక పచ్చ ముఠాలు ఆగుతాయా? మరింత చెలరేగిపోతున్నాయి. విక్రయాలు చేపట్టేసి, దగ్గరుండి అక్రమ నిర్మాణాలు చేయిస్తున్నాయి.
రోజుకో కొత్త బాష్యం
మఠం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని అందరికీ తెలిసిందే. కళ్లముందే కబ్జాలు కన్పిస్తున్నాయి. అడ్డగోలు నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ, ఆ భూముల స్వభావంపై అధికారులు రకరకాల భాష్యాలు చెబుతున్నారు. మఠం భూములని ఎక్కడా లేదంటూనే అవి 22ఎ (నిషేధిత భూములు)లో ఉన్నాయని ఒకసారి, నాట్ టేకింగ్ ఓవర్ లిస్టులో ఉన్నాయని మరోసారి చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడా భూములపై కోర్టులో వివాదం నడుస్తోందని, వాటిని స్వాధీనం చేసుకోవడం, ఆక్రమించుకోవడం కుదరదని అధికార వర్గాలు అంటున్నాయి. సమాధానాలు అన్నీ అధికారుల దగ్గరే ఉన్నాయి. కానీ కబ్జాకు గురవుతున్న భూములను కాపాడే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీనికంతటికీ కీలక నేత కనుసన్నల్లో జరిగిన ఆక్రమణలు, వేసిన అక్రమ లేఅవుటే కారణమని అక్కడున్న వారందరికీ తెలుసు.
ఎమ్మెల్యే సిఫార్సులతోనే..
అవి అసలైన మఠం భూములు.. ఆపై వివాదాస్పద భూములు. ఆ భూముల్లో బయట వ్యక్తి అడుగు పెడితే తక్షణమే అడ్డుకోవాలి. అలాంటి భూముల్లో ఏకంగా అక్రమ లేవుట్ వేస్తే నిలువరించలేదు. అమ్మకాలు జరుపుతుంటే పట్టించుకోవడం లేదు. కానీ, ఎమ్మెల్యే కూన రవికుమార్ సిఫార్సు చేశారని, రూ. కోటి 45లక్షల ఉపాధి నిధులతో ప్రజల అవసరార్థం రోడ్లు, కాలువలు వేయించారని అధికారులు చెప్పడం మరింత ఆశ్చ ర్యం కలిగిస్తోంది. ఉపాధి నిధులను ఈ రకంగా ఖర్చు పెట్టొచ్చా.. కేంద్రమిచ్చే నిధులను అక్రమార్కులకు ధారపోయచ్చా అనే కొత్త ఆలోచన కలిగించారు. అక్కడెక్కడా ప్రజలు లేరు. ఖాళీ స్థలాలు, అక్కడకక్కడా అక్రమ నిర్మాణాలు తప్ప మరేవీ కనిపించవు. కానీ, ప్రజలు ఉన్నారని రోడ్లు, కాలువలు వేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు.
400 ఏళ్ల చరిత్ర గల భూముల ఆక్రమణ
ఆక్రమిత భూముల్లో అక్రమ లేఅవుట్
కబ్జా భూముల్లో వేసిన లేఅవుట్‌కు ఉపాధి హామీ నిధులతో రోడ్లు, కాలువలు
ఎమ్మెల్యే సిఫార్సు మేరకు వేశామంటున్న అధికారులు
విస్తుగొలుపుతున్న ఆమదాలవలస నియోజకవర్గం అక్రమాలు


