● రూ.15 లక్షల ఆస్తినష్టం
● లబోదిబోమంటున్న గిరిజనులు
హిరమండలం: కొండపోడులో భాగంగా చేపట్టిన చీపురు పంట అగ్నికి ఆహుతి కావడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. హిరమండలం మండలంలోని గొడియాపాడు గిరిజన గ్రామంలో గిరిజనులు పెద్ద ఎత్తున చీపురు పంట సాగు చేస్తున్నారు. పంట చేతికందుతున్న సమయంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేసవి గాలులకు మంటలు పూర్తిగా వ్యాపించాయి. కళ్లెదుటే పంట కాలిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గిరిజనులు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనలో సవర చిన్నికి చెందిన 2.7 ఎకరాలు, సవర గుడమకు చెందిన 3 ఎకరాలు, సవర చిన్నసొడంగకు చెందిన 3.4 ఎకరాలు, ఊయక సంధ్యకు చెందిన 2.4 ఎకరాలు, ఆరిక గౌరమ్మకు చెందిన 2 ఎకరాలు కాలిపోయాయి. సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


