తాగిన మత్తులో చంపేశారా..?
● జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్య
● హత్యకు గురైన ప్రదేశంలో మద్యం సీసాలు
● మద్యం తాగి చంపి ఉంటారని పోలీసుల అనుమానం
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల : శ్రీకాకుళం నగరానికి సమీపంలో పొన్నాడ తోటల్లో గురువారం పైలా మోహన్ (43) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పొన్నాడ పంచాయతీ ఆంజనేయస్వామి దేవాలయ సమీప తోటపాలెం రోడ్డు మార్గంలోనున్న రాజీ గారి తోటలో ఈ హత్య జరిగింది. హత్య జరిగిన ప్రదేశంలో మద్యం సీసాలు ఉండటంతో మద్యం సేవించిన మత్తులో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు, స్థా నికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..
వాంబేకాలనీ సమీప మలుపు వద్దనే వరుణ్ ఐస్‌క్రీమ్ పార్లర్, కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ నడుపుతున్న మోహన్.. భార్య శారదతో పాటు పదో తరగతి చదువుతున్న కుమారుడు వరుణ్‌తో కలసి రాజీవ్ గృహకల్ప 1వ నంబర్ బ్లాక్‌లో నివాసముంటున్నాడు. స్థానికంగా యువకులతో సరదాగా ఉండే మోహన్‌కు ఎవరితో ఎలాంటి తగాదాలు లేవని కుటుంబీకులు తెలిపారు.
తోటలో శవమై..
గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయటకెళ్తానని భార్యతో చెప్పి మోహన్ ద్విచక్రవాహనం స్టార్ చేయగా ఎంతకీ స్టార్ట్ అవ్వలేదు. దీంతో అలా నడుచుకుంటూనే పొన్నాడ బ్రిడ్జి వైపు వెళ్లాడు. అక్కడకు కొన్ని గంటల్లోనే మోహన్ తల వెనుక భాగాన బలమైన గాయమై రక్తపు మడుగులో తోటలో పడి ఉన్నాడు. సమాచారం తెలిసిన వెంటనే జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐలు లక్ష్మణరావు, సందీప్, క్లూస్ టీమ్‌తో ఘటనా స్థలికి చేరుకున్నారు. సమీపంలోనే 5 బీరు సీసాలు, ఒక విస్కీ బాటి ల్ ఉండగా అందులో 2 బీర్లు ఓపెన్ చేయకుండానే ఉండటాన్ని పోలీసులు గమనించారు. పోలీసు జాగిలం కూడా మద్యం సీసాల వద్ద ఆగి 10 మీటర్ల దూరం లోపలికి వెళ్లి మళ్లీ తిరిగి తోట గోర్జి మీదుగా రోడ్డు వైపు వెళ్లింది.
మద్యం సేవించి చంపేశారా..?
మోహన్ తెలిసిన వ్యక్తులతోనే మద్యం సేవించి ఉంటాడని, మత్తులోనే ఘర్షణ పడి లావుపాటి కర్రతో గానీ రాడ్‌తో గాని కొట్టి చంపి ఉంటారని పోలీసు లు భావిస్తున్నారు. మద్యం బాటిల్‌పైనున్న క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయగా పొన్నాడ వద్దనున్న వైన్‌షాపు నుంచి కొన్నట్లు రావడంతో ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. షాపులో సీసీ ఫుటేజీ ఆధారంగాను, బ్రిడ్జి వెంబడి కూడా సీసీ కెమెరాలు ఉండటంతో నిందితులు దొరికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాక ఇటీవల అతను గంజాయి సేవించే యువతతో కూడా స్నేహంగా ఉంటూ మద్యం పార్టీలకు వెళ్తుండేవాడని స్థానికులు అంటున్నారు.
తాగిన మత్తులో చంపేశారా..?


