పలాసలో ఆగని గ్రావెల్ దందా
● రాత్రి పూట తవ్వకాలు
● మాయమవుతున్న కొండలు
పలాస: పలాస నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల దందా ఆగడం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉంటే అప్పుడు ఇష్టారాజ్యంగా కంకర తవ్వకాలు చేపడుతున్నారు. రూ.కోట్లు విలువైన కంకరను రోజూ వందలాది టిప్పర్లు ద్వారా తరలించుకు పోతున్నారు. తాజాగా పలాస మండలం రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలోని లలితా చారిటబుల్ ట్రస్ట్ వృదా్‌ధ్‌శ్రమం వెనుక సర్వే నంబరు 157లో ప్రభుత్వ భూమిలో కంకర తవ్వకాలు చేపడుతున్నారు. ఆ పక్కనే జిల్లాలోనే అతి పెద్దదైన జగనన్న కాలనీ కూడా ఉంది. ప్రస్తుతం కంకర తవ్వుతున్న భూమి కూడా గతంలో జగనన్న కాలనీ కోసం సేకరించిన స్థలమని అక్కడి స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన స్థలమని కూడా కొందరు అంటున్నారు. మొత్తానికి స్థలం ఎవరిదైనా ఎటువంటి అనుమతులు లేకుండా కంకర తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా మందస మండలం కుంటికోట, రట్టి కొండలు, పలాస మండలం కంబిరిగాం వద్ద కూడా కంకర అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్లి తూతూమంత్రంగా చర్యలు చేపట్టి తర్వాత విడిచి పెట్టేస్తున్నారని విమర్శలు వినిస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ పెంటిభద్ర రెవెన్యూలోని 410 సర్వేలో కంకర తవ్వకాలు చేపట్టిని వారిపై తగిన చర్యలు తీసుకోలేదని, కేవలం కంకర తవ్వకాన్ని ఆపేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి అక్రమార్కులపై గట్టి చర్యలు తీసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.


