ఫిషింగ్ హార్బరు.. గుర్తుందా సారూ!
ఎచ్చెర్ల: స్థలం కేటాయింపు పూర్తయ్యింది. టెండర్లు కూడా ఎప్పుడో పిలిచేశారు. రాతి కట్టడాలు, అంతర్గత రోడ్లు సైతం ప్రారంభించారు. కానీ ఆ తర్వాతి పనులు కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌పై సర్కారు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఆఖరుకు బడ్జెట్‌లోనూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. మత్స్యకారుల్లో వలసలు నిర్మూలించేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసింది. 2023 ఏప్రిల్ 19న పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. భావనపాడు పోర్టు ప్రారంభానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో పనులు ప్రారంభించారు. అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, అప్పటి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ భూమి పూజ నిర్వహించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కూటమి వచ్చాక పనులన్నీ నిలిచిపోయాయి. దీనిపై మత్స్యకారులు మండి పడుతున్నారు. అసంపూర్తిగా విడిచిపెట్టిన పనులను పూర్తిచేయాలని కోరుతున్నారు. ఫిషింగ్ హార్బర్‌కు భూమి పూజకు ముందే రూ. 366 కోట్లు టెండర్ పూర్తిచేశారు. ఈ టెండర్లను విశ్వసముద్ర కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. సర్వే నంబర్ 504–18లో 42 ఎకరాలు ప్రభుత్వ స్థలం కేటాయించారు. ఇక్కడ ప్రారంభించన పనులు 2024 జనవరితో ఈ పనులు నిలిచిపోయాయి. టెండరు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ హార్బర్‌లో బస్‌స్టాండ్, యాక్షన్‌హాల్, కోల్డ్‌స్టోరేజ్, మైరెన్ పోలీసుస్టేషన్ ఆయిల్‌బంక్, ఇంజిన్ బోట్ల మరమ్మతులకు వర్క్‌షాప్ వంటి విభాగాలతో కూడిన వాటిని నిర్మించేలా పనులను ఆరంభించింది.
నెలలు గడుస్తున్నా..
ఏడాదిలో హార్బర్ పనులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంకా పనులను ప్రారంభించలేదు. 2025 ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుడగట్లపాలెం గ్రామానికి చేరుకుని ఏడాదిలోగా హార్బర్‌ను పూర్తిచేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించాల్సిన భరోసా చెక్కులను కూడా ఇక్కడ నుంచే అందజేశారు. దాదాపు 10 నెలలు కావస్తున్నా హార్బర్ పనులు తిరిగి ప్రారంభం కాకపోవడంతో ఇక్కడ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్న కూటమి ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి కనీస చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ అనుబంధ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకుని హార్బర్ పునఃనిర్మాణ పనులను చేపట్టకపోవడం విచారకరం. ఇప్పటికై నా హార్బర్ పనులను పునఃప్రారంభించి గంగ పుత్రుల వలసలు నివారించాలని వారంతా కోరుతున్నారు.
ముందుకు సాగని ఫిషింగ్ హార్బర్ పనులు
తీవ్ర నిరాశలో మత్స్యకారులు
బడ్జెట్‌లోనూ స్పష్టత ఇవ్వని వైనం
మత్స్యకారులకు నిరాశే..
స్థానిక మత్స్యకారులు ఈ ఫిషింగ్ హర్బర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని పది గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వీరావల్, సూరత్, తమిళనాడు, మహారాష్ట్ర, వంటి ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్న వారు సైతం ఇక్కడకు వచ్చి పనిచేసుకోవచ్చు. నిర్మాణంలో జాప్యం మత్స్యకారులకు శాపంగా మారుతోంది. వెనుకబడిన మత్స్యకార ప్రాంతం ప్రగతికి గత ప్రభుత్వం కృషి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
ఫిషింగ్ హార్బరు.. గుర్తుందా సారూ!


