లోపం నాయకులది.. నెపం అధికారులపై
పాలకుల దక్షత.. మూడు రోజుల ముచ్చట
● రథసప్తమిలో పెత్తనమంతా నాయకులదే
● నిమిత్తమాత్రులైపోయిన రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు
● తప్పులన్నీ దేవదాయ శాఖ అధికారులపై నెట్టేసే యత్నం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రథ సప్తమికి అర్చకుల సలహాలు వినలేదా..? దేవదాయ శాఖ అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదా? అంతా ప్రజా ప్రతినిధులు చెప్పినట్టే జరిగిందా? అందుకే దర్శనాల్లో విఫలమయ్యారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎవరు చే యాల్సిన పనులు వారు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అపచారమేనా?
సాధారణంగా ధనుర్మాసంలోని వైకుంఠ ఏకదాశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం తెరుస్తారు. కానీ ఎన్నడూ లేని విధంగా రథ సప్తమి రోజు ఉత్తర ద్వారం తెరిచి భక్తులను విడిచిపెట్టారు. అర్చకులు చెప్పినా వినలేదని సమాచారం. ఇదో అపచారంగా భక్తులు భావిస్తున్నారు.
అనాలోచిత నిర్ణయాలు..
రథసప్తమి రోజున ఉద్యోగుల విధుల విషయంలో కూడా అనాలోచితంగా వ్యవహరించారు. సాధారణంగా ప్రొటోకాల్ డ్యూటీలు, వీఐపీలను దగ్గరుండి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అఽధికారులు చూసుకునే వారు. ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దేవాలయం వెలు పల రెవెన్యూ అధికారులు, అంతరాలయం లోపం దేవదాయ శాఖాధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా అంతా రివర్స్‌లో చేశారు. అనుభవం ఉన్న రెవెన్యూ ఉన్న వాళ్లని అవసరం లేని చోట వేశారు. అనుభవం లేని వాళ్లను అవసరం ఉన్న చోట వేశారు. చెప్పాలంటే రెవెన్యూ అధికారులను క్యూ లకు కాపలాగా వేశారు. దీంతో సమన్వయ లోపం చోటు చేసుకుంది. ఫలితంగా అంతా గందరగోళమై భక్తులను కష్టాలకు గురి చేసింది. అంతేకాదు వీఐపీ పాసుల జారీ విషయం కూడా ఆలయం అధికారులకు తెలియదన్న వాదనలు ఉన్నాయి.
స్కానింగ్ మెకానిజమేదీ?
అర్ధగంట దర్శనమన్నారు. అంతరాలయంలో ఆరు లైన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వేర్వేరుగా క్యూలు ఉన్నాయని చెప్పారు. తీసుకున్న ప్రతి ఒక్కరినీ స్కాన్ చేసి పంపిస్తామన్నారు. కానీ, రథసప్తమి రోజున అంతా తుస్సు అని తేలిపోయింది. స్కానర్‌లు కనిపించలేదు. టిక్కెట్లు తీసుకున్న వారిని స్కాన్ చేసే పరిస్థితి లేదు. దీంతో భక్తులు గుంపుగా క్యూలోకి వచ్చేయడంలో తోపులాటలు, తొక్కిస లాటలు జరిగాయి. అంతరాలయంలో ఎప్పుడూ చూడని విధంగా జాయింట్ కలెక్టర్ దర్శనాలు దగ్గర ఉండటం ఆశ్చర్యం కలిగించింది.
అధికారులంతా అక్కడే..
రథసప్తమి దర్శనాలు మరికొన్ని నిమిషాల్లో జరగాల్సి ఉండగా కోడి రామ్మూర్తి స్టేడియంలో మ్యూజికల్ డైరెక్టర్ తమన్ మ్యూజికల్ నైట్ కొనసాగింది. అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం దాదాపు అక్కడే ఉంది. టెక్కలి ఆర్డీఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా అక్కడే ఉండిపోయారు. అంతా అక్కడే ఉండిపోతే దేవస్థానం దగ్గర వేలాదిగా వచ్చే క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఎలా జరుగుతుందన్న విషయాన్ని విస్మరించారు. దాని పర్యవసనమే భక్తులకు ప్రత్యక్ష నరకం.
నెపమంతా దేవదాయ శాఖపైనే..
భక్తులు నరకం చూశాక, పెద్ద ఎత్తున ఆర్తనాదాలు వినిపించాక, అంత వరకు పెత్తనం చెలాయించిన ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మాట మార్చేశారు. ఇవేం ఏర్పాట్లు అని దేవదాయ శాఖాధికారులపై పడ్డారు. ఈఓ, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా నియమితులైన కనకమహలక్ష్మి దేవాలయం డిప్యూటీ కమిషనర్ శోభారాణిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ జిల్లా ఉన్నతాధికారి గట్టిగా తిట్టడంతో ఆ మహిళా అధికారి కంట తడి పెట్టుకున్నారు. అంతేకాకుండా మరో శాఖ అధికారిపై కూడా తప్పు నెట్టేసేందుకు యత్నించడంతో ఆ అధికారి సెలవుపై వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.


