పాలకుల దక్షత.. మూడు రోజుల ముచ్చట
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలో రథ సప్తమి పేరుతో జరిగిన పనులు మూన్నాళ్ల ము చ్చటగా మారాయి. రథ సప్తమికి నగరం సుందరీకరణ పేరుతో రూ.3.30కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. అయితే ఇందులో ఎన్ని పనులు ప్రారంభించారో, ఎన్ని ప్రారంభించకుండా వదిలేశారో, ప్రారంభించిన పనులు ఎంత మేరకు జరిగాయో ఆ సూర్యభగవానుడికే తెలియాలి. హడావుడిగా చేసిన పనులు మూడు రోజులకే ముక్కలైపోయాయి.
పర్యవేక్షణ ఉందా..?
అసలు పనులు జరిగిన చోట ఇంజినీరింగ్ సిబ్బంది పర్యవేక్షణ చేయాలి. కానీ నగరంలో అవేమీ కనిపించడం లేదు. టైల్స్ వేస్తున్న సిమెంట్‌లో ఇసుక తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. దీంతో ఫుట్‌పాత్‌లపై వేసిన టైల్స్ వేసిన కొన్ని గంటల్లోనే ఊడిపోతున్నాయి.
పనుల ప్రతిపాదనలు ఇలా..
నగరంలో పలు కూడళ్లలో పెయింటింగ్స్ వేసేందుకు రూ.17లక్షల నిధులు వెచ్చించారు. కొత్తవంతెన, పాత వంతెన మినహాయిస్తే ఇంకెక్కడా రంగులు వేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఫుట్‌పాత్‌లపై టైల్స్ వేయడం వంటివి కూడా మమ అనిపించేస్తున్నారు. నగరంలో ఏడురోడ్లు కూడలి, రామలక్ష్మణ కూడలి ప్రాంతాల్లో లైటింగ్ కోసం స్తంభాలు వేసేందుకు సంక్రాంతి పండుగ సమయంలో రోడ్డుకి మధ్యలో పెద్ద పెద్ద గోతులు తవ్వేసి దుస్తులు కొనుగోలు చేసేవారికి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పటి వరకు స్తంభా లు ఏర్పాటు చేయలేదు. రథ సప్తమి ఉత్సవాలు చేస్తామని రెండు మూడు నెలలు ముందే నిర్ణయించినప్పుడు ప నులకు టెండర్లు మాత్రం పదిరోజులు ముందు ఎందుకు పిలుస్తున్నారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కొత్త రోడ్డు వద్ద రథ సప్తమి ముందురోజు సిమెంట్ పనిచేసి ఓ సర్కిల్‌ను నిర్మించారు. ఆ తర్వాతకే ముక్కలైపోయింది.
చర్యలు చేపడతాం
చేసిన పనుల్లో నాణ్యత లోపాలుంటే సంబంధిత కాంట్రాక్టర్ లేదా ఇంజినీర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. రథ సప్తమి అంటే కేవ లం ఆ రోజుకే పనులు కాదు శాశ్వత ప్రాతిపదిక ఉండాలనే ఆలోచనతోనే పనులన్నీ చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లోపాలున్నా సరిచేస్తాం.
– కమలాకర్, మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్. శ్రీకాకుళం నగరపాలక సంస్థ


