● మార్కెట్ విస్తరణలోనూ అదే నిర్వాకం
నగరంలోని పొట్టి శ్రీరాముల మార్కెట్‌లో గత ప్రభుత్వం రోడ్లను వేసి అభివృద్ధి చేసింది. దానికి ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఐడీఎస్‌ఎంటీ పథకం కింద రుణ సాయంతో షాపులను నిర్మించారు. కూల్చివేతల ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం దృష్టి ఇప్పుడా షాపులపై పడింది. వాస్తవానికి షాపుల భవనాలు పటిష్టంగా ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించాలన్న దానిపై ఆలోచన చేయకుండా గత పాలకుల ముద్ర కనబడకుండా, స్వప్రయో జనాలతో అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు విస్తరణ అజెండా ఎత్తుకుంది. యుద్ధ ప్రాతిపదికన రెండు బ్లాకుల్లోని షాపులు కూల్చేస్తోంది. ఒక బ్లాక్‌లో 32 షాపులను ఇప్పటికే కూల్చేయగా, మరో బ్లాక్‌లోని 38 షాపులను కూల్చే పనిలో పడింది. భవనాలు పటిష్టంగా ఉండటంతో ప్రొక్లైనర్లు కూల్చడానికి కష్టపడుతున్న పరిస్థితులు నెలకున్నాయి. అంత స్ట్రాంగ్‌గా ఉన్న భవనాలను వ్యక్తిగత అజెండా కోసం ఎలాంటి ప్లాన్ లేకుండా, అనుమతులు రాకుండానే కూల్చేడం విమర్శలకు దారితీస్తోంది. అది కూడా పండగ పూట కూల్చేడంతో అక్కడున్న వారు తమ వ్యాపారాలను నష్టపోతున్నారు.
ఏ మాత్రం ఆలోచన చేయకుండా
ప్రస్తుతం మార్కెట్‌లో కూల్చేస్తున్న షాపులను 2008లో వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వంలో ఐడీఎస్‌ఎంటీ పథకం కింద రుణ సాయంతో నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 30 శాతం, రుణ సాయం 70శాతంగా ఉంది. ఈ రుణాన్ని 25ఏళ్ల లోగా తీర్చాలి. రుణం క్లియర్ కాకుండా ఆ భవనాల జోలికి వెళ్లడం, వాటిని కూల్చడం కూడా చట్ట విరుద్ధం. కానీ, ప్రస్తుత పాలకులు ఎలాంటి ప్రణాళిక, ముందు చూపులేకుండా యుద్ధ ప్రాతిపదికన కూల్చేస్తున్నారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రెంటికి చెడ్డ రేవడిలా కూల్చివేతలు తయారవుతాయి. కూల్చివేతల ఎత్తుగడ వెనక నేతల స్వప్రయోజనాలు, దురాలోచన ఉన్నట్టు తెలుస్తోంది. తమ అనుయాయులకు శాశ్వత ప్రాతిపదికన కట్టబెట్టేందుకు ప్లాన్ చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఎవరైతే షాపు కావాలనుకుంటారో వారే తమ సొంత నిధులతో నిర్మించుకుని, తర్వాత ఆ షాపును అనుభవించేలా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఇప్పుడా షాపుల్లో ఉన్న వ్యక్తులకు అంత స్థోమత లేదు. వారి స్థానంలో నేతల అనుయాయులే దక్కించుకుని, సొంత నిధులతో నిర్మించి, తమ జాగీరులా వాడుకునేలా చేసుకోవడమే ఎత్తుగడ అని వాదనలు ఉన్నాయి.


