● కదం తొక్కిన 104 ఉద్యోగులు
పల్లెల్లో సంజీవనిగా వైద్య సేవలందిస్తున్న 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలను తగ్గించడం దారుణమని, భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ ఏజెన్సీ నిర్వాకం తగదని ఉద్యోగులంతా నిరసన వ్యక్తం చేశారు. జిల్లా 104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ఉద్యోగులంతా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ తమకు భవ్య ఏజెన్సీ నుంచి దారుణంగా వేధింపులు ఎదురవుతున్నాయని, నెలకు సుమారుగా రూ.780 వర కు జీతం తగ్గించారని, అలాగే ఎర్న్‌డ్ లీవ్, క్యాజువల్ లీవ్స్‌ను కూడా రద్దు చేయడం దారుణమన్నా రు. బఫర్ సిబ్బందిని నియమించి రోజుకు డ్రైవర్‌కు రూ.500 ఇచ్చి నడిపిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అరబిందో యాజమాన్యం ఇచ్చిన జీతాల కంటే దారుణంగా కోత విధిస్తున్నా రని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీ దారుణాలను గుర్తించి తక్షణమే తమకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘ ప్రతినిధులంతా డిమాండ్ చేశారు. – అరసవల్లి


