పండగకు ‘ధరా’ఘాతం!
ఎలా కొనేదీ?
ధరలు నియంత్రించాలి
డిపోల ద్వారా ఇవ్వాలి..
సంక్రాంతి పండగ వస్తే చాలు ప్రతి తెలుగింటా పిండివంట ఘుమఘుమలాడాల్సిందే. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా ఉన్నంతలో గొప్పగా జరుపుకుంటారు. అయితే ఈసారి పండగకు సామాన్యులపై ధరల భారం ఎక్కువైంది. బియ్యం నుంచి పప్పులు వరకు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక కూరగాయలు, గుడ్లు ధరల సంగతి సరేసరి.
● ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు ● హడలెత్తిపోతున్న సామాన్యులు
హిరమండలం: సామాన్యులు పండగ చేసుకోవాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వంట నూనెల ధరలు సలసలా కాగుతుండగా.. కూరగాయల ధరల అధరహో అనిపిస్తున్నాయి. గతంలో ఉన్నడూ లేనివిధంగా నిత్యావసరాల ధరలు రోజురోజూకూ పెరిగిపోతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
మండుతున్న నూనెలు..
కూరగాయలు, నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీనికి తోడు వంటనూనెలు ధరలు కూడా మండిపోతున్నాయి. రిఫండ్ ఆయిల్ పది రోజుల క్రితం రూ.140 ఉండగా ఇప్పుడు రూ.165కి పెరిగింది. పామాయిల్ ధర కొండెక్కి కూర్చొంది. పదిరోజుల క్రితం రూ.120 ఉండగా ఇప్పుడు రూ.140కి చేరింది.
ఉడకని పప్పులు..
వేరుశనగ పలుకులు ధరలు ఒక్కసారిగా పెంచేశారు. పది రోజుల క్రితం కేజీ రూ.110 కాగా ఇప్పుడు రూ.130 నుంచి రూ.150కి అమ్ముతున్నారు. కంది పప్పు ఒక్కసారిగా రూ.20 పెరిగింది. పదిరోజుల కిందట రూ.120 ఉండగా రూ.150కి పెంచేశారు. మినప్పప్పు కిలో రూ.115 నుంచి రూ.130కి పెరిగింది.
డిపోల్లో కానరాని కందిపప్పు..
గతంలో రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, పామాయిల్ పంపిణీ చేసేవారు. గత ఏడాది నుంచి చాలా డిపోల్లో కందిపప్పు పంపిణీ నిలిపివేశారు. అప్పట్లో కిలో కందిపప్పు కేవలం రూ.67కే అందించేవారు. ఇప్పుడు సరఫరా నిలిపివేయడంతో పేదలు పప్పులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు.
అంతా సిండికేట్ మాయ..
ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, హోల్‌సేల్,రిటైల్ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ప్రజలను దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో షాపులో ఒక్కో రకంగా ధరలను అమలుచేస్తున్నా పౌరసరఫరాల శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడటంలేదు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినప్పటికీ దానిని బోర్డులకే పరిమితం చేస్తున్నారు. ఎవరైనా జీఎస్టీ తగ్గిందని ప్రశ్నిస్తే ఇంకా తమకు ఆదేశాలు రాలేదంటూ సమాధానం ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు.
నిత్యావసరాల ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రజల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
– సిర్ల ప్రసాద్
సీఐటీయూ నాయకుడు
నూనె, పప్పు దినుసులు, బియ్యం తదితర నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ధరలను నియంత్రించేలా పాలకులు చర్యలు చేపట్టాలి.
– జి.లలిత,
తంప గ్రామం, హిరమండలం
బయటమార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. సామాన్యులు కొనలేకపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలి. రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, నూనె సరఫరా చేయాలి.
– కె.రోజా,
యంబరాం, ఎల్‌ఎన్‌పేట మండలం
పండగకు ‘ధరా’ఘాతం!
పండగకు ‘ధరా’ఘాతం!
పండగకు ‘ధరా’ఘాతం!


