అందని పరిహారం
గత అక్టోబర్‌లో ముంచెత్తిన వరదలు
నీట మునిగిన పంట పొలాలు
పరిశీలనకే పరిమితమైన పాలకులు
బాధిత రైతులకు తప్పని
ఎదురుచూపులు
నష్టం అపారం..
కొత్తూరు :
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్లితే వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకుంటామని గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక షరామామూలుగా హామీని విస్మరించారు. గత ఏడాది అక్టోబర్ 3న వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురిశాయి. వంశధార నదికి సుమారు లక్షా పది వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఉద్ధృతంగా ప్రవహించింది. వంశదార నదీ తీర ప్రాంతాలైన కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట తదితర మండలాల్లో 2739 మంది రైతులకు చెందిన 1132 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైంది. 26 మంది రైతులకు చెందిన 13.06 హెక్టార్ల మొక్కజొన్న పంట నాశనమైంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన పంటంతా పూర్తిగా నష్టపోవడంతో రైతులు కుదేలయ్యారు.
ఎదురుచూపులు ఎన్నాళ్లో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వెంటనే పరిహారం అందేది. దీంతో రైతులు పంట పోయినా కోలుకునే వారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదు. ఇందుకు అక్టోబర్ వరదలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. వరదలు వచ్చి నాలుగు నెలలైనా పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో నష్టపోయిన పంటలు వివరాలు పంపించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించడంతో.. వ్యవసాయ శాఖ అధికారులు పంటల విస్తీర్ణం, రైతులు వివరాలతో కూడిన జాబితాను సమర్పించారు. అయినా ఇంతవరకు చిల్లిగవ్వ కూడా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న సంక్రాంతి పండగ నాటికై నా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
●
అందని పరిహారం


