నిబంధనలు పాటించకుంటే చర్యలు
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం పేద ప్రజల కోసం వేలాది కోట్లు వెచ్చించి అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని పలు రేషన్ డిపోలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందుగా బలగ హాస్పిటల్ రోడ్డులోని డిపోను పరిశీలించిన కాంతారావు, అక్కడ స్టాక్ ఉన్నప్పటికీ అదనపు వస్తువులైన గోధుమపిండి, బెల్లం విక్రయించడంలో విఫలమవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా సరఫరా అధికారిని ఆదేశించారు. అనంతరం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న డిపోలను సందర్శించి, నోటీసు బోర్డులో వివరాలు ప్రదర్శించకపోవడం చట్టపరంగా తప్పని హెచ్చరించారు. న్యూ కాలనీలోని డిపో మూసివేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, అంగన్‌వాడీలకు బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ డీలర్‌పై చర్యలకు ఆదేశించారు. శ్రీకాకుళం అర్బన్ పరిధిలోని గాజులవీధి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, అక్కడ స్టాక్ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు. హాజరు పట్టికలో గైర్హాజరైన వారిని రెడ్ మార్క్‌తో గుర్తించాలని, రికార్డుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులకు అందించే ఆహార నాణ్యతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎస్‌ఎన్‌ఎం పాఠశాల సందర్శనలో భాగంగా అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. పర్యటనలో ఆయనతో పాటు జిల్లా సరఫరా అధికారి జి.సూర్యప్రకాశరావు, ఐసీడీఎస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.


