9న రథసప్తమి ఉత్సవాలకు శ్రీకారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 19 నుంచి 25 వరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 9వ తేదీ ఉదయం 8 గంటలకు ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో సూర్యనమస్కారాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా ఫ్లెక్సీలు, విదేశీ పుష్పాలతో అలంకరణలు చేయాలని ఆదేశించారు. రూ.100 క్యూ లైన్లు, ఉచిత దర్శనం లైన్లలో వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకూడదని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు పార్కింగ్ నుంచి ఆలయం వరకు రవాణా సౌకర్యం కల్పించాలని, పోలీసు శాఖ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. గతంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి భోజనం అందలేదన్న ఫిర్యాదులు మళ్లీ రాకూడదని, ఫుడ్ కమిటీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సిక్కోలు రథసప్తమి జ్ఞాపికలు, పొందూరు ఖాదీ శాలువాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నిర్వహణకు 15 ప్రత్యేక కమిటీలు:
ఉత్సవాల విజయవంతం కోసం 15 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఫండింగ్ కమిటీ, ఆహ్వాన పత్రికల కమిటీ, పబ్లిసిటీ కమిటీ వంటి కీలక బృందాలను నియమించారు. వీటితో పాటు శోభాయాత్ర, మెగా సూర్యనమస్కార్, సాంస్కృతిక కార్యక్రమాలు, పార్కింగ్, బ్యూటిఫికేషన్ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డీఆర్వో ఎస్వీ లక్ష్మణమూర్తి, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, ఆలయ ఈఓ, మున్సిపల్ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


