కన్నీటి తీరం!
● సముద్రంలో బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి ● ప్రాణాలతో బయటపడ్డ మరో నలుగురు ● దేవునల్తాడలో విషాదం
వజ్రపుకొత్తూరు: సముద్రంలో రాకాసి అలలకు మర బోటు బోల్తాపడిన ఘటనలో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు చెక్క గోపాలరావు(46) మృతి చెందాడు. మరో నలుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునల్తాడకు చెందిన చెక్క గోపాలరావుకు భార్య మహాలక్ష్మీ, ఇద్దరు కుమారులు రాజు, చాణిక్య ఉన్నారు. సముద్రంలో చేపల వేట జీవనాధారంగా బతుకుతున్నారు. ఎప్పటిలాగే మంగళవారం వేకువజామున గాడి శ్రీనివాసరావుకు చెందిన మర బోటులో గోపాలరావు, శ్రీనివారావు, తెరుపల్లి లింగమయ్య, ఎరుపల్లి ఈశ్వరరావు, చింతల దానేసులు వేటకు వెళ్లారు. కొద్దిసేపటికే రాకాసి అలల ఉధృతికి బోటు బోల్తా పడింది. అందరూ చెల్లాచెదురయ్యారు. అతికష్టమ్మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గోపాలరావు ఆచూకీ లభ్యం కాకపోవడంతో బోటుతో వెళ్లి గాలించారు. చివరకు తీవ్ర గాయాలతో మృతి చెందిన గోపాలరావును గమనించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీరానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతుడి భార్య మహాలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీటి తీరం!


