ఎస్పీ గ్రీవెన్సుకు 36 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)కు ప్రజల నుంచి 36 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వినతులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
రైతు నాయకుడు చిన్నబాబు మృతి
టెక్కలి: మండలంలోని పెద్దసాన గ్రామానికి చెందిన రైతు నాయకుడు కోట చిన్నబాబు (103) సోమవారం మృతి చెందారు. ఆయన ఈ గ్రామానికి 5 దశాబ్ధాలు సర్పంచ్‌గా, రైతు నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు. ప్రస్తుతం టెక్కలిలో బీఎస్ అండ్ జేఆర్ విద్యా సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రముఖులు, కుటుంబ సభ్యుల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు చిన్నబాబు నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు శివరామరాజు పెద్దసాన గ్రామ సర్పంచ్‌గా సేవలు అందజేశారు. అలాగే మరో కుమారుడు మురళీధర్ గతంలో టెక్కలి జెడ్పీటీసీగా సేవలు అందజేశారు. అంతేకాకుండా గ్రానైట్ అసోసియేషన్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నబాబు మృతిపై గురజాడ విద్యాసంస్థల అధినేత స్వామి నాయుడు తదితరురు సంతాపం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాన్ని అస్సాం చీఫ్ సెక్రటరీ కోట రవి మంగళవారం పరామర్శించనున్నారు.


