బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

Jan 6 2026 8:04 AM | Updated on Jan 6 2026 8:04 AM

బీసీల

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

శ్రీకాకుళం: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం 42 శాతం రిజర్వేషన్‌ను తప్పనిసరి చేయాలని అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు కేవీఎస్‌ నాయుడు (బుజ్జి) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం తామంతా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా రిజర్వేషన్‌ విషయంలో బీసీలకు అండగా నిలిచే విధంగా 42 శాతం రిజర్వేషన్‌ అంశాన్ని చట్టసభలలో ప్రస్తావన తీసుకొచ్చి ఆమోదానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్‌ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో రిజర్వేషన్‌ విషయమై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ విభాగం అధికార ప్రతినిధి బొడ్డేపల్లి దామోదరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ అవుట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావును అవుట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్‌ క్యాలెండర్‌ను ఆయన చేతులమీదుగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 8000 మంది అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను విన్నవిస్తూ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థ వలన రోజురోజుకూ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిన జీతాలు రాష్ట్రం మొత్తం మీద ఏ కార్మికుడు కూడా అందుకోని పరిస్థితులపై అధ్యయనం చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను సమూలంగా రద్దు చేసి ప్రతి కార్మికుడికి యాజమాన్యం ద్వారా జీతాలు చెల్లించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తంగుడు ముత్యాలరావు, ప్రధాన కార్యదర్శి గంగాంజనేయులు, రాష్ట్ర కమిటీ నాయకులు వి.బాజి, ప్రసాద్‌ కుమార్‌, మధుసూదనరావు, దాసరి కిరణ్‌, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళ మెడలో

పుస్తెల తాడు చోరీ

ఆమదాలవలస: పట్టణంలోని 12వ వార్డు చంద్రయ్యపేటకు చెందిన కరణం సుమిత్ర అనే మహిళ, తన మెడలో సుమారు రెండున్నర తులాల పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తి అపహరించినట్లు ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. కరణం సుమిత్ర అత్త అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె భర్త వైద్య చికిత్స నిమిత్తం విశాఖపట్నానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సుజాత ఇంటి బయట ఉన్న బాత్రూంలో స్నానం చేసి తిరిగి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో బెదిరించాడు. అరిస్తే తన పిల్లలను చంపేస్తానని చెబుతూ మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలాఉండగా పట్టణంలో ఇటీవల పెరుగుతున్న చోరీలు, స్నాచింగ్‌ ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

సరుబుజ్జిలి: మండలంలోని షళంత్రి జంక్షన్‌ వద్ద సోమవారం ఒక ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఆమదాలవలస నుంచి సరుబుజ్జిలి వస్తున్న ఆటోను, శ్రీకాకుళం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. అయితే ఆటోలో ప్రయాణిస్తున్నవారికి, బస్సులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బీసీలకు 42 శాతం   రిజర్వేషన్‌ కల్పించాలి1
1/2

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

బీసీలకు 42 శాతం   రిజర్వేషన్‌ కల్పించాలి2
2/2

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement