అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● సహాయ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్
● పీజీఆర్‌ఎస్‌లో 173 అర్జీల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సహాయ(శిక్షణ) కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, విశ్రాంత జిల్లా రెవెన్యూ అధికారి (పలాస ఎయిర్‌పోర్టు ప్రత్యేక అధికారి) ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్‌లతో కలిసి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 173 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ–69, సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ–49, పంచాయతీ రాజ్–9, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్–7, వ్యవసాయ శాఖ–5, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్–5, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్–5, ఏపీఈపీడీసీఎల్–4, రూరల్ వాటర్ సప్లయ్ ఇంజినీరింగ్–3, రూరల్ డవలప్‌మెంట్–3, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్–2, మెడికల్ ఎడ్యుకేషన్–2, వాటర్ రీసోర్సెస్–2, స్కూల్ ఎడ్యుకేషన్–2, మైన్స్ అండ్ జియాలజీ–2, సమగ్ర శిక్ష–1, ఎండోమెంట్–1, ఏపీ స్టేట్ స్కిల్ డవలప్‌మెంట్–1, ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు–1 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేకంగా రెవెన్యూ క్లీనిక్
ఈవారం వినతుల స్వీకరణతో పాటు ప్రత్యేకంగా రెవెన్యూ క్లీనిక్ పేరిట రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, సిబ్బందిని పీజీఆర్‌ఎస్ హాల్‌కు తీసుకొచ్చారు. వినతుల స్వీకరణకు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు 9 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో 22ఏ, జాయింట్ ఎల్‌పీఎం, మ్యుటేషన్, ఎఫ్‌లైన్, అడంగల్ రాకపోవడం, విస్తీర్ణంలో తేడాలు, ఎస్‌ఎల్‌ఆర్‌లో భూమి నమోదు లేకపోవడం వంటి సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ విభాగానికి 140 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ సమస్యలపై వినతుల స్వీకరణ తప్ప పరిష్కారం జరగలేదు. ఉన్నతాధికారులు గ్రీవెన్సులో లేకపోవడంతో పరిష్కరానికి వీలున్న వాటిని కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ వారం రెవెన్యూ క్లీనిక్ వినతుల్లో ఎక్కువ శాతం అర్జీలు మండల స్థాయిలో పరిష్కారం జరగాల్సింది. కానీ అక్కడ జరగకపోవడంతో జిల్లా గ్రీవెన్సును ఆశ్రయిస్తున్నారు.
రోడ్డు తొలగింపును అడ్డుకోవాలి
పొందూరు మండలంలోని గోకర్ణపల్లి గ్రామ సచివాలయానికి వేసిన రోడ్డు తొలగింపు చర్యలను అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సుమారు రూ.5 లక్షల నిధులు ఖర్చుచేసి గ్రామ సచివాలయానికి సీసీ రోడ్డును వేయడం జరిగిందన్నారు. ప్రజాపయోగానికి వేసిన రోడ్డును టీడీపీ నాయకులు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గోకర్ణపల్లి సర్పంచ్ చింతాడ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి


