రైస్‌మిల్లు లెక్కల్లో తేడాలు
● మిల్లు సీజ్ చేసిన మంత్రి నాదెండ్ల
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని చింతాడ పరిసర ప్రాంతంలో గల చిట్టెమ్మ రైస్‌మిల్‌ను సీజ్ చేయాలంటూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం చింతాడ గ్రామంలోని చిట్టెమ్మ రైస్‌మిల్‌ను నేరుగా పరిశీలించారు. కెపాసిటీకి మించి ట్రక్‌షీట్లు నమోదైనట్లు ఆన్‌లైన్‌లో చూపించడం, రైస్‌మిల్లుకు 23వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం ఇస్తే నవంబర్ నుంచి వెయ్యికిపైగా ట్రక్‌షీట్లు నమోదు కావడం, తూకాల్లో, స్టాకులో తేడాలు రావడం, రికార్డుల్లో ధాన్యం బస్తాల వివరాలను నమోదు చే యకపోవడంతో సంబంధిత మిల్లు యజమాన్యానికి మంత్రి ప్రశ్నించారు. వారు నీళ్లు నమలడంతో వెంటనే మంత్రి స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులపై సీరియస్ అయ్యారు. ఉన్నఫలంగా మిల్లును సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే ఇలాగే జిల్లాలో చాలా మిల్లుల్లో పరిస్థితి ఉంది. ట్రక్‌షీట్లు జారీ చేయకుండానే మిల్లులకు ధాన్యం వెళ్తుంది అనడానికి ఇదే నిదర్శనం. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, జేసీ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సా యి ప్రత్యూష, జిల్లా పౌరసరఫరాల అధికారి సూర్యప్రకాశరావు, అగ్రికల్చర్ ఏడీ త్రినాథరావు, ఎమ్మార్వో గణపతిరావు, సర్పంచ్ అరవల రామ్‌ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


