● వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు చించివేత
టెక్కలి:
కోటబొమ్మాళి పాతబస్టాండ్‌లో పంచాయ తీ పార్కు వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం, నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంపై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సోమవారం ఉదయం కొంత మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గమనించి మండల స్థాయి నాయకులకు తెలియజేశారు. దీంతో కోటబొమ్మాళి సర్పంచ్ కాళ్ల సంజీవ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.హేమసుందర్‌రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, మండల స్థాయి నాయకులు రోణంకి మల్లయ్య, దుక్క రామకృష్ణారెడ్డి, పి.వెంకట్రావు, కల్లి విశ్వనాధం, హెచ్.గోవిందరావు, అనపాన కర్రెయ్య, శివారెడ్డి, పి.సతీష్, గుంట సోమేశ్వరరావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని ఫ్లెక్సీలను పరిశీలించారు. అనంతరం కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ కొంత మంది వ్యక్తులు చిల్లర రాజకీయాలకు అలవాటు పడి ఇలా వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చింపివేశారని పేర్కొన్నారు. ఇలాంటి కవ్వింపు చర్యల వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే కోటబొమ్మాళిలో ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కొంత మంది అడ్డు చెప్పారని గుర్తు చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొనలేక ఇలాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి ఫ్లెక్సీలు చింపిన వారిని అదుపులోకి తీసుకుని భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు.


